Scam: వారు దొంగలు. ముఖం కనిపించదు. మాట మాత్రమే వినిపిస్తుంది.. కోయిల పలికినట్టు.. రామచిలక మాట్లాడినట్టు.. అమృతం తాగిన గొంతుతో పలకరించినట్టు.. వారి వ్యవహార శైలి ఉంటుంది.. తీయటి మాటలతో 14 కోట్లు కొట్టేశారు. చూస్తుండగానే మోసం చేశారు. మాయమాటలతో బురిడీ కొట్టించారు. అలాగని మోసపోయిన వ్యక్తి నిరక్షరాస్యుడు కాదు. పేరుపొందిన డాక్టర్. వేలాది మంది రోగాలు నయం చేసి.. పెద్ద గొప్ప పేరు ఉన్న ఆయన చివరికి మోసపోయాడు.. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 14 కోట్లను నష్టపోయి లబోదిబో అంటున్నాడు.
ఆ డాక్టర్ ఎర్రగడ్డలో నివాసం ఉంటాడు. అతడు నాడీ పట్టుకుంటే ఎంతటి మొండి రోగమైన సరే నయం కావాల్సిందే అందువల్ల ఆయనకు ఆ ప్రాంతంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఆయన వద్దకు రోగులు వస్తుంటారు.. అదే ఆ వైద్యుడికి ఈనెల ఆగస్టు 27న ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మౌనిక మాధవన్.. అనే మహిళ మెసేజ్ చేసింది. తాను పెళ్లి చేసుకున్నానని.. భర్త వల్ల మోసపోయానని చెప్పింది. ప్రస్తుతం తన విడాకుల కేసు పెండింగ్లో ఉందని ఆ వైద్యుడితో తన బాధను వ్యక్తం చేసింది. ఇది నిజమైన నమ్మిన ఆ వైద్యుడు ఆమె చెప్పిన మాటలు మొత్తం విన్నాడు.
ప్రైవసీ కోసం టెలిగ్రామ్ ఐడి ద్వారా మాట్లాడుకుందామని ఆమె ప్రతిపాదించడంతో.. దానికి ఆ వైద్యుడు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సంభాషణలపర్వం సాగుతోంది. ఇదే క్రమంలో మనకు షేర్ ట్రేడింగ్లో విపరీతమైన అనుభవం ఉందని ఆ మహిళ ఆ వైద్యుడుతో చెప్పింది. అంతేకాదు ప్రతిరోజు తను నాలుగు నుంచి ఐదు లక్షల వరకు సంపాదిస్తున్నానని చెప్పింది. తన మాదిరిగా ట్రేడింగ్ చేసుకోవాలంటే పేరు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. దానికి సంబంధించిన వెబ్సైటు లింక్ పంపించింది. ఆ తర్వాత 30 లక్షల పెట్టుబడి పెట్టాలని ఆ వైద్యుడిని సెప్టెంబర్ 30న ఒప్పించింది. మొదటి ట్రేడ్ లో 8.6 లాభం వచ్చిందని వైద్యుడి వర్చువల్ ఖాతాలో చూపించింది. దీంతో అతడిని 10 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని తీసుకొచ్చింది. ఇదే క్రమంలో వైద్యుడు తన అకౌంట్ నుంచి 85000 డ్రా చేసుకోవడానికి ఆమె అవకాశం కల్పించింది. దీంతో ఆ వైద్యుడికి నమ్మకం కుదరడంతో బ్యాంకులలో రుణాలు తీసుకున్నాడు. స్నేహితుల దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చాడు. 14 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాడు. అయితే అతడి ఖాతాలో 34 కోట్ల వరకు నగదు నిల్వలు ఉన్నట్టు ఆ ఖాతాలో చూపించింది.
తన ఖాతాలో ఉన్న డబ్బులను డ్రా చేసుకోవడానికి అతడు ప్రయత్నించగా టాక్స్ కింద 7.5 కోట్లు చెల్లించాలని ఆ మహిళ చెప్పింది. దానికి ఆ వైద్యుడు ఒప్పుకోలేదు. అయితే తన వాటా ప్రకారం యుఎస్డిటి రూపంలో 50 శాతం టాక్స్ చెల్లిస్తానని .. తదుపరి 3.75 కోట్లను చెల్లించాలని ఆ వైద్యుడిపై ఆ మహిళ వైద్యుడి పై తీసుకొచ్చింది. ఇదే క్రమంలో ఆమె పంపించిన డాక్యుమెంట్లు అడ్డగోలుగా ఉండడంతో అతడికి అనుమానం వచ్చింది. ఆ వైద్యుడు గట్టిగా నిలదీయడంతో ఆ మహిళ ఒక్కసారిగా మాట్లాడడం మానేసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ వైద్యుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.