Rajanna Sircilla: చరమాంకంలో మేనల్లుడి దగ్గరికి వస్తే.. స్మశానంలోని వరండాలో వదిలి వెళ్లాడు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం

పాపం ఆ వృద్ధురాలి వయసు 70 సంవత్సరాలు. కట్టుకున్న భర్త కాలం చేశాడు. నా వాళ్ళు అని చెప్పుకోవడానికి ఆమెకు కన్న పిల్లలు లేరు. వృద్ధాప్యంలో.. కాస్త ఆసరాగా ఉంటాడని మేనల్లుడు దగ్గరికి వస్తే.. అతడు ఏకంగా స్మశానం వరండాలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 23, 2024 8:53 am

Rajanna Sircilla

Follow us on

Rajanna Sircilla: ఈ హృదయ విదారకమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన కూకట్ల రాజవ్వ (70) అనే వృద్ధురాలికి భర్త చనిపోయాడు. ఆమెకు పిల్లలు లేరు. పెద్దగా ఆస్తి పాస్తులు కూడా లేవు. తన సోదరుడి కుమారుడు కూకట్ల తిరుపతి వద్దకు ఇటీవల రాజవ్వ వచ్చింది. వృద్ధురాలు కావడంతో ఏ పనీ చేసుకోలేకపోతోంది. అయితే రాజవ్వ రావడం తనకు భారంగా మారిందని మేనల్లుడు తిరుపతి ఆమెను ఏకంగా స్మశాన వాటికలోని వరండాలో వదిలి వెళ్ళిపోయాడు. కాళ్లు లేవలే ని స్థితిలో రాజవ్వ అక్కడే ఆకలితో అలమటించిపోయింది. కనీసం తాగేందుకు కూడా నీరు లేకపోవడంతో నరకం చూసింది. అదే అటువైపుగా వెళ్లిన కొంతమందికి రాజవ్వ దీనస్థితి కంటికి కనిపించింది. వెంటనే వారు ఆమెను చూసి చలించిపోయారు. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు ఆమె వద్దకు వెళ్లారు. ఆమెకు చికిత్స అందించి.. వివరాలు సేకరించారు. రాజవ్వ చెప్పిన మాటలు విన్న పోలీసులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వచ్చారు.

తిరుపతికి కౌన్సిలింగ్

రాజవ్వ తో మాట్లాడి వివరాలు సేకరించిన అనంతరం పోలీసులు తిరుపతిని పిలిపించారు. కౌన్సిలింగ్ ఇచ్చారు.. ఆ తర్వాత రాజవ్వను అతని ఇంటి వద్ద కు పంపించారు. అయితే ఈ ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది. మనుషుల్లో మాయమైపోతున్న అనుబంధాలను కళ్ళకు కట్టింది. సరిగ్గా మూడు నెలల క్రితం సూర్యాపేట జిల్లాలో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. కాకపోతే ఆస్తిలో వాటా కోసం కన్న కొడుకు తల్లి చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రాలేదు. ఫలితంగా ఆ మాతృమూర్తి మృతదేహం మూడు రోజులపాటు ఫ్రీజర్ లో ఉండాల్సి వచ్చింది. చివరికి పెద్దమనుషులు, పోలీసులు సర్ది చెప్పడంతో ఆ కుమారుడు అంత్యక్రియలు నిర్వహించడానికి ఒప్పుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని ఎన్నో సంఘటనలు మన చుట్టూ ఉన్న సమాజం లో చోటు చేసుకుంటున్నాయి. స్థూలంగా చెప్పాలంటే మనుషుల్లో మానవత్వం అనేది చచ్చిపోతున్నది. డబ్బుల కోసం మాత్రమే మనుషులు తోటి మనుషులతో సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు. ఆ డబ్బు లేని నాడు దూరం పెడుతున్నారు. చివరికి స్మశానంలో వదిలివేయడానికి కూడా వెనుకాడటం లేదు. తిరుపతి – రాజవ్వ ఉదంతంలో ఈ సమాజం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఎవరూ లేకపోవడంతో మేనల్లుడి ఇంటికి వస్తే అతడేమో స్మశానం వరండాలో వదిలిపోయాడు. కనీసం వృద్ధురాలనే స్పృహ కూడా అతనిలో లేదు. చలికి వణుకుతూ.. దోమల మధ్య ఆ వృద్ధురాలు ఎంత నరకం చూసిందో.. ఆకలికి అలమటించి.. నీరు లేక ఇబ్బంది పడి.. ఎంతటి వేదన అనుభవించిందో.. ఇప్పటికైనా తిరుపతిలో మార్పు వచ్చి.. రాజవ్వను మంచిగా చూసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కూడా అలానే ఆదేశించారు.