Dana Cyclone: దానా ఎఫెక్ట్‌… 34 రైళ్లు రద్దు చేసిన ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తుపానుగా మారింది. ఒడిశావైపు కదులుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఒడిశాకు తుపాను హెచ్చరిక జారీ చేసింది. దీని ప్రభావంతో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

Written By: Raj Shekar, Updated On : October 23, 2024 8:47 am

Dana Cyclone(1)

Follow us on

Dana Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారింది. ఇది మంగళవారం తుపానుగా మారింది. ఓడిశా తీరంవైపు కదులుతోంది. దీని ప్రభావంతో బుధవారం ఒడిశాలోని తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. ఇక ఈ తుపానుకు దానా అని పేరు పెట్టారు. ఈ దానా ప్రభావంతో 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐంఎడీ తెలిపింది. మరోవైపు ఒడిశా ప్రభుత్వం కూడా అలర్ట్‌ అయింది. అక్టోబర్‌ 23 నుంచి 25 వరకు మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని సూచించింది. అక్టోబర్‌ 24న తుపాను తీరం దాటుతుందని ఆ సమయంలోను బలమైన గాలులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దానా తుపాను ప్రభావం ఒడిశాతోపాటు పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లోనూ ఉంటుందని వివరించింది.

34 రైళ్లు రద్దు..
ఇదిలా ఉంటే.. అండమాన్‌ సముద్రం నుంచి దూసుకొస్తున్న దానా తుపాన్‌ ముప్పు నేపథ్యంలో ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే కూడా అలర్ట్‌ అయింది. తుపాను నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈస్ట్‌ కోస్ట్‌ పరిధిలోని భువనేశ్వర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ మధ్య నడిచే 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం(అక్టోబర్‌ 23న) ఒడిశా తీరప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐంఎడీ తెలిపింది. ఆదివారం అండమాన్‌ సముద్రంలో ఆవర్తనం ఏర్పడింది. అది సోమవారం ఉదయానికి అల్పపీడనంగా మారింది. మంగళవారం మరింత బలపడి బుధవారం తుపానుగా మారుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వాలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే 34 రైళ్లను రద్దు చేసింది.

14 జిల్లాల్లో ప్రభావం..
దానా తుపాను ప్రభావం ఒడిశాలోని 14 జిల్లాల్లో ప్రధానంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోని పూరి, గంజాం, జగత్‌సింగ్‌పూర్, భద్రక్, బాలాసోర్, జగత్‌సింగ్‌పూర్, మయార్‌ భంజ్, కియోంజర్, థెంకనల్, జాజ్‌పూర్, అంగుల్, నయాగర్గ్, ఖర్దా, కటక్‌ జిల్లాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఒడిశాలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపింది. దానా ప్రభావంతో ఒడిశా తీరప్రాంతంలో 24, 25 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐంఎడీ తెలిపింది.