Tamil Nadu: చివరి సెల్ఫీ అన్నాడు.. జీవిత సత్యం చెప్పాడు.. ఏమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

విధి చాలా విచిత్రమైనది. దాని రాతను విధాత కూడా మార్చలేడు. అంత బలీయమైన విధికి అప్పుడప్పుడు కన్నుకుడుతుంది. హాయిగా సాగిపోతున్న జీవితాల్లో చిచ్చు పెడుతుంది. మన ప్రమేయం లేకుండానే బంధాలు, అనుబంధాలను దూరం చేస్తుంది. తీరని దుఃఖాన్ని మిగులుస్తుంది.

Written By: Raj Shekar, Updated On : September 18, 2024 3:04 pm

Tamil Nadu

Follow us on

Tamil Nadu: విధి రాతను బ్రహ్మ కూడా మార్చలేడు అంటారు పెద్దలు.. కొన్ని సంఘటనలు చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది. విధి ముందు ఎంతటివాడైనా తల వంచాల్సిందే అనిపిస్తుంది. మన ప్రమేయం లేకుండా జరిగే కొన్ని తప్పులు.. విధి ఎంత బలీయమైందో తెలియజేస్తుంది. అందులోనూ మన ప్రమేయం ఉందని తెలియజేస్తుంది. చిన్నపాటి నిర్లక్ష్యమే మనకు శాపమైందన్న వాస్తవాన్ని గ్రహించేలా చేస్తుంది. ఇలాంటి ఘటనే ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది. తెలియకుండా జరిగిన చిన్న పొరపాటు తీవ్ర పరిణామాలకు దారితీసింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి జీవితంలో చిన్న నిర్లక్ష్యంతో అతనికి తీరని దుఃఖం మిగిల్చింది. దీనిపై అతడు జరిగిన కథను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. అప్రమత్తం చేశాడు.

ఏం జరిగిందంటే…
ఈ ఏడాది జనవరి 7వ తేదీన సాయంత్రం 6 గంటలకు సదరు వ్యక్తి తన భార్యతో బైక్‌పై బయటకు వెళ్లాడు. అన్నా నగర్‌ దగ్గరకు వచ్చాక అతని భార్య ఒక్కసారిగా కిందపడిపోయింది. వెంటనే అప్రమత్తమైన భర్త ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు ఓ షాకింగ్‌ విషయం చెప్పారు. ఆమె మెదడు ఎడమవైపు భాగం ఉబ్బుతోందని పేర్కొన్నారు. ఆమె బతకడం కష్టమని తెలిపారు. దీంతో వెంటనే భర్త.. ఆమెను మరో ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

ఆపరేషన్‌ చేసినా..
మరోసారి పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమెకు ఆపరేషన్‌ చేయాలని సూచించారు. దీనికి అంగీకరించాడు. ఆపరేషన్‌ తర్వాత మెదడు స్పందించడం తగ్గిపోయింది. ఆ సమయంలో ఆమె ఐదు నెలల గర్భిణి. కొన్ని గంటలకే ఆమె కోమాలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే ఐదు రోజులకు కడుపులో ఉన్న బిడ్డ లోకాన్ని చూడకుండానే లోపలే చనిపోయింది. తర్వాత ఆమె కూడా బ్రెయిన్‌ డెడ్‌ అయిందని వైద్యులు తెలిపారు.

పుట్టెడు దుఃఖంలో అవయవదానం..
భార్య బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో అవకవదానం చేయాలని వైద్యులు సూచించారు. దీంతో అలువురి జీవితాల్లో వెలుగులు నింపొచ్చని తెలిపారు. దీంతో పుట్టెడు దుఃఖంలోనూ అతడు అవయవదానానికి ముందుకు వచ్చాడు. ఆర్గాన్‌ డొనేషన్‌ పామ్‌పై సంతకం చేశాడు. వారం రోజుల వ్యవధిలో(జనవరి 13 వరకు) అంతా జరిగిపోయింది.

చిన్నపాటి నిర్లక్ష్యమే..
తాను చేసిన చిన్నపాటి నిర్లక్ష్యమే తన భార్యను తనకు కాకుండా చేసిందని అతను రాసుకొచ్చాడు. తాము బయటకు వెళ్లినప్పుడు తాను హెల్మెట్‌ పెట్టుకున్నానని, తన భార్య మాత్రం పెట్టుకోలేదని వెల్లడించాడు. ఆమె బైక్‌పై నుంచి కిందపడిన సమయంలో హెల్మెట్‌ లేకపోవడంతో తలకు బలమైన గాయమై ఇంతటి పరిణామానికి దారి తీసిందని పేర్కొన్నాడు. ఆమె హెల్మెట్‌ పెట్టుకుని ఉంటే.. తన భార్య తనకు దూరమయ్యేది కాదని తెలిపాడు. చిన్నపాటి అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా తన జీవితంలో తీరని బాధ మిగిలింది అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా చివరి సెల్ఫీ అంటూ తన భార్యతో ఉన్న ఫొటోను పోస్టు చేశాడు.