Hyderabad Nacharam: ఆన్‌లైన్ మోసాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అరికట్టేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నా ఇప్పటికీ అనేక మంది మోసపోతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే. సోషల్ మీడియా వచ్చాక డిస్కౌంట్ ఆఫర్ల ప్రచారం పెరిగింది. పెద్ద కంపెనీల నుంచి చిన్న చిన్న వీధి వ్యాపారులు కూడా వాడేసుకుంటున్నారు. కొందరు ఆఫర్ల పేరిట మోసాలు చేస్తున్నారు. అలాంటి మోసమే తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. జనవరి 26న రూ.26 వేలకు కారు ఇస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చూసి వందల మంది ఎగేసుకుంటూ వచ్చారు. తీరా వచ్చాక విషయం తెలుసుకుని షాక్ అయ్యారు.
హైదరాబాద్ నాచారంలోని మల్లాపూర్‌లో గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఒక వ్యాపారి చేసిన ప్రకటన పెద్ద గందరగోళానికి దారితీసింది. స్థానిక పాత కార్ల వ్యాపారి రోషన్, తన షోరూమ్‌లో 50 వాహనాలు ఉన్నాయని, కేవలం రూ.26 వేలకే జనవరి 26న విక్రయిస్తామని ఇన్‌స్టాగ్రామ్ ఓ వీడియో పోస్టు చేశాడు. ఈ ప్రచారం వైరల్ అవ్వడంతో నగరం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా వందల మంది వచ్చారు. సోమవారం తెల్లవారుజాము 3 గంటల నుంచే షోరూమ్ ముందు భారీ క్యూలు ఏర్పడ్డాయి.
మాట మారిచన వ్యాపారి..
సమయం దగ్గరపడేసరికి వ్యాపారి మాట మార్చాడు. తన వద్ద అందుబాటులో ఉన్నవి 10 కార్లు మాత్రమేనని, మిగిలినవి ఇప్పటికే అమ్ముడయ్యాయని చెప్పాడు. ఇది విని అధిక సంఖ్యలో చేరుకున్న కొనుగోలుదారులు ఆగ్రహానికి గురయ్యారు. దూరాలు ప్రయాణించి వచ్చిన తర్వాత మోసపోయిన భావనతో షోరూమ్‌లో ఉన్న వాహనాలపై రాళ్లు విసరడం మొదలుపెట్టారు. అద్దాలు దెబ్బతిని, ఆస్తి నష్టం జరిగింది. పరిస్థితి తీవ్రతరం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని అదుపు చేశారు.
వ్యాపారిపై కేసు..
నాచారం పోలీసులు వెంటనే కదిలి, మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్ వ్యాపారి రోషన్‌పై కేసు నమోదు చేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేసి, శాంతి భద్రతలకు భంగం కలిగించాడని చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో కనిపించే అసాధారణ ఆఫర్లను నమ్మొద్దని సూచించారు. ఈ సంఘటన ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తత అవసరాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయం తెలిసి చాలా మంది రూ.26 వేలకు కార్ల టైర్లు కూరావు.. కారు అంటే ఎలా నమ్మారు అంటు నవ్వుకుంటున్నారు.