Hyderabad: మందు తాగితే.. నెత్తికి నిషా ఎక్కితే.. మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. చాలా మంది మందు బాబులు తాగిన తర్వాత అనసర విషయాల్లో తలదూరుస్తారు. తమది తప్పని తెలిసినా.. రైట్ అని వాదిస్తారు. గొడవలకు దిగుతారు. ఇక వాహనాలు నడిపేటప్పుడు అయితే.. మత్తులో ఎంత స్పీడ్ వెళ్తున్నామో కూడా తెలియక ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. అందుకే పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపేవారిని పట్టుకుని జరిమానాలు విధిస్తున్నారు. కోర్టులు జైలుకు కూడా పంపుతున్నాయి. అయినా.. మందుబాబులో తీరులో మార్పు రావడం లేదు. తాగక ముందు.. బుద్ధిమంతుడిలా వ్యవహరిస్తూ.. తాగిన తర్వాత తమను ఆపేదెవడ్రా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మద్యం తాగి.. వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన మందుబాబులో హల్‌చల్ చేశారు.
చంపాపేట్‌లో హల్‌చల్..
హైదరాబాద్‌లోని చంపాపేట్ చౌరస్తాలో మందుబాబు హల్‌చల్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన యువకుడు మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. ఒకసారి వదిలేయమని కాళ్లు పట్టుకున్నాడు.. ఇంకోసారి రాళ్లు పట్టుకున్నాడు. తన బడి తనకు ఇవ్వాలని అరిచి గోల చేశాడు. తన చొక్కా తానే చించుకున్నాడు. పోలీసులు కొట్టారని రచ్చ చేశాడు. తన బండి సీజ్ చేయొద్దని హంగామా చేశాడు. రోడ్డుపై వెళ్లే వాహనదారులను కూడా ఇబ్బంది పెట్టాడు. చివరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వాహనం సీజ్ చేశారు.
గతంలో టిఫిన్ సెంటర్ ధ్వంసం..
గతంలో హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదురుగు మందుబాబులు ఇలాగే హంగామా చేశారు. ఫుల్లుగా మద్యం సేవించి పాపారాయుడు నగర్‌లోని కేవీ. టిఫిన్ సెంటర్ వద్ద ఓ వ్యక్తితో గొడవ పడ్డారు. టిఫిన్ సెంటర్ యజమాని అక్కడి నుంచి వెళ్లాలని సూచించాడు. దీంతో మందుబాబులు మరింత చెచ్చిపోయారు. హోటల్‌లోని సామగ్రి ధ్వంసం చేశారు. యజమాని, సిబ్బందిపై దాడి చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు నిందితులను పట్టుకుని కేసు పెట్టారు.