https://oktelugu.com/

AP Liquor Policy: తిరుపతికి అత్యధికంగా మద్యం షాపులు.. ఆ పవిత్రత ఏది ‘బాబు’ గారు

మందు బాబులకు శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం. మరో నాలుగు రోజుల్లో నచ్చిన బ్రాండ్లు.. తక్కువ ధరకు లభించునున్నాయి. నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రైవేటు మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే రాష్ట్రంలో అత్యధికంగా తిరుపతి జిల్లాకు మద్యం షాపులు ఎక్కువగా కేటాయించడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : September 28, 2024 / 11:20 AM IST

    AP Liquor Policy

    Follow us on

    AP Liquor Policy: ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు రద్దు అయ్యాయి. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ప్రైవేటు మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ల ప్రక్రియ ద్వారా షాపులను కేటాయించాలని డిసైడ్ అయింది. నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా 3736 షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో 340 షాపులను కల్లుగీత కార్మికులకు కేటాయించింది. మిగిలిన 3396 షాపులను లాటరీ విధానంలో కేటాయిస్తారు.అయితే అత్యధికంగా తిరుపతి జిల్లాకు 264 షాపులు కేటాయింపు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.ప్రస్తుతం తిరుపతి లడ్డు వివాదం నెలకొన్న నేపథ్యంలో కొత్త ప్రచారం ప్రారంభం అయ్యింది. తిరుమల పవిత్రతను కాపాడేందుకు తాము లడ్డు తయారీ పై దృష్టి పెట్టామని.. నెయ్యిలో జంతు కొవ్వు కలిపినట్లు తేలిందని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. గత పది రోజులుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. రాజకీయ అంశంగా మారిపోయింది. అధికార విపక్షం మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది.సరిగ్గా ఇటువంటి సమయంలోనే మద్యం షాపుల కేటాయింపు ప్రకటించడంతో వైసిపి అస్త్రం గా మార్చుకుంది. తిరుపతి పవిత్రతను కాపాడాలనుకుంటున్న చంద్రబాబు..అదే తిరుపతి జిల్లాకు మద్యం షాపులను అధికంగా కేటాయించడంఫై సోషల్ మీడియా వేదికగా వ్యంగ్య ప్రచారం ప్రారంభించింది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    * ఐదేళ్లుగా అస్తవ్యస్తం
    వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. మద్యం ధరలను అమాంతం పెంచేసింది. దేశంలో ఎక్కడా చూడని, వినని బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రజారోగ్యానికి తీవ్ర భంగం వాటిల్లింది. నాసిరకం మద్యంతో చాలామంది చనిపోయారంటూ విపక్షాలు కూడా ఆరోపించాయి. కానీ ఈ ప్రచారాన్ని ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అయితే తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో మందుబాబులు సైతం ఖుషి అయ్యారు. కూటమి పార్టీలకు మద్దతు తెలిపారు. టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో మద్యంపై కదలిక వచ్చింది. ప్రభుత్వ మద్యం దుకాణాలు రద్దయ్యాయి. ప్రైవేటు దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి.

    * ప్రభుత్వంపై సానుకూలత
    మరో కొద్ది రోజుల్లో కొత్త మద్యం విధానం అమలు కానుండడం.. అన్ని రకాల మద్యం బ్రాండ్లు పాత ధరలకే లభించనుండడంతో ప్రభుత్వానికి ఒక రకమైన మైలేజ్ కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే లడ్డు వివాదం తెరపైకి రావడం, తిరుపతి జిల్లాకు అత్యధికంగా మద్యం షాపులను కేటాయించడం వైసిపికి అస్త్రంగా మారింది. తిరుమల పవిత్రతను కాపాడుతానన్న చంద్రబాబు తీరుపై విమర్శల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో వైసీపీ సానుభూతిపరులు పోస్టులు పెడుతున్నారు. వాటిని ట్రోల్ చేస్తున్నారు.

    * హై టెన్షన్
    ఏపీలో ఎన్నికలు జరిగి నాలుగు నెలలు అవుతోంది. కానీ ఎన్నికల్లో సమయంలో ఉన్నంత రాజకీయ వేడి కనిపిస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. టీటీడీ లడ్డు వ్యవహారంలో తమను ఇరికించడాన్ని వైసిపి జీర్ణించుకోలేకపోతోంది. అందుకే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టాలని చూస్తోంది. భూతద్దంలో పెట్టి వెతుకుతోంది. ఏ చిన్న అంశం దొరికినా.. దానిని పెద్దది చేస్తూ ప్రచారం చేస్తోంది. అందులో భాగంగా తిరుపతి జిల్లాకు కేటాయించిన మద్యం షాపుల విషయంలో.. వినూత్న రీతిలో ప్రచారం మొదలు పెట్టేసింది వైసిపి. దీనిపై టిడిపి ఎలా స్పందిస్తుందో చూడాలి.