Relationship crimes : ఒకచోట దారుణం. ఆ దారుణం సృష్టిస్తున్న సంచలనం.. దాని మర్చిపోకముందే మరో అఘాయిత్యం.. అది రేపుతున్న ప్రకంపనలు మర్చిపోకముందే.. ఇంకొక కలకలం.. అది సృష్టించిన చర్చను మర్చిపోకముందే ఇంకోటి.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి దారుణాలు జరుగుతున్నాయి. అవి కూడా కనివిని ఎరుగైన స్థాయిలో చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో? ఎటువైపు నుంచి ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అర్థం కావడం లేదు.
ఒకప్పుడు దేశంలో ఆడవాళ్లకు అంతగా భద్రత లేదు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ స్థానంలో భర్తలు అని చేర్చుకోవాలేమో.. ఎందుకంటే ఇటీవల మన దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న సంఘటనలు అలా ఉంటున్నాయి మరి. పైగా భర్తలను భార్యలు స్కెచ్ వేసి మరి అంతం చేయడం సంచలనం కలిగిస్తోంది. ఒకదాని మించి మరొక సంఘటన జరుగుతుండడం భయభ్రాంతులకు గురిచేస్తున్నది. దీంతో చాలామంది యువకులు పెళ్లి అంటేనే భయపడిపోతున్నారు. పెళ్లయిన కొత్తలో భార్యతో హనీమూన్ కలిసి వెళ్లడానికి హడలి పోతున్నారు. ఏ మూల నుంచి ఎటువంటి వ్యక్తి వస్తాడో.. ఎక్కడ హతమార్చుతాడో అనే భయంతో వణికి పోతున్నారు.
ఇక ఇటీవల దేశవ్యాప్తంగా భర్తల మరణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో.. జాతీయ నేర రికార్డుల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం భర్తల మరణాలలో మొదటి స్థానంలో ఉంది. 2020 సంవత్సరంలో ఇక్కడ 45 మంది భర్తలు చనిపోయారు. 2021లో ఈ సంఖ్య 52 కు చేరుకుంది. 2022లో 60 కి చేరుకుంది. 2023లో 55కు చేరుకుంది. 2024 లో 62 కు పెరిగింది. బీహార్ రాష్ట్రంలో 2020లో 30, 2021లో 35, 2022లో 40, 2023లో 39, 2024లో 42 మంది భర్తలు హతమయ్యారు. రాజస్థాన్ రాష్ట్రంలో 2020 సంవత్సరంలో 20, 2021 సంవత్సరంలో 25, 2022 సంవత్సరంలో 28, 2023 సంవత్సరంలో 30, 2024 సంవత్సరంలో 35 మంది భర్తలు హతమయ్యారు.
మహారాష్ట్రలో 2020 సంవత్సరంలో 15, 2021లో 18, 2022 లో 20, 2023లో 22, 2024లో 25 మంది భర్తలు హతమయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2020లో 12 మంది, 2021లో 15 మంది, 2022లో 18 మంది, 2023లో 20 మంది, 2024లో 22 మంది భర్తలు భార్యల చేతిలో హతమయ్యారు. అయితే ఈ మరణాలు మొత్తం వివాహేతర సంబంధాల వల్లే చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. ఇందులో కొంతమంది భర్తలు బాధితులు కాగా.. మరి కొంతమంది ఇతర మహిళలతో సంబంధాలు ఏర్పరచుకొని.. ఆ తర్వాత జరిగిన వివాదాలలో హతమయ్యారు. అయితే ఈ కేసులలో చాలావరకు త్వరగానే పురోగతి సాధించాయి. పోలీసులకు ఈ కేసులో కాల్ డాటాలు కీలకంగా మారాయి. వాటి ద్వారానే ఈ కేసుల్లో పోలీసులు నిందితులను గుర్తించారు. పకడ్బందీ ఆధారాలతో వారిని కటకటాల వెనక్కి పంపించారు. ప్రస్తుతం వారంతా జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.