Delhi crime news: అది ఢిల్లీ నగరం.. చావ్లా ప్రాంతం.. ఓ ఇంటి గడియ తీయలేదు. ఇంట్లో వారు ఊరికి వెళ్లారేమో అని చుట్టుపక్కల వారు అనుకున్నారు. ఇంటి గడియ పెట్టి ఉంది. ఇంట్లో నుంచి మాత్రం గురక శబ్దం వస్తోంది. అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు ఇంటి గడియ తీశారు. ఆ తర్వాత అక్కడి సన్నివేశం చూసి వారు ఒక్కసారిగా వణికి పోయారు.
చావ్లా ప్రాంతంలో ఓ బస్ కంపెనీలో వీరేంద్ర అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఇతడికి భార్యా పిల్లలు ఉన్నారు. వీరేంద్ర తన భార్యను, పిల్లలను వదిలేసి 44 సంవత్సరాల ఓ మహిళతో సహజీవనం సాగిస్తున్నాడు. ఆమెకు పాలం అనే ప్రాంతంలో ఇల్లు ఉండేది. ఇవాళ ఆ ఇంటిని విక్రయించింది. వచ్చిన డబ్బుతో గత ఆగస్టు నెలలో వీరేంద్ర చావ్లా ప్రాంతంలో మూడు అంతస్తుల నివాసం కొనుగోలు చేశాడు.
ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత మిగిలిన డబ్బు దాదాపు 21 లక్షలు తన వద్ద ఉంచుకున్నాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని ఆ మహిళ వీరేంద్రను నిత్యం అడిగేది. ఈ విషయంలో వీరేంద్రకు, ఆమెకు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో అతడు బయటికి వెళ్లి మద్యం తాగాడు. ఆ మత్తులో ఆ మహిళతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహం పెరిగిపోయి మంచం మీద ఉన్న ఆ మహిళ గొంతును మోచేతితో అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేశాడు. దీంతో ఆ మహిళ చనిపోయింది. ఆ మహిళ చనిపోయిన తర్వాత వీరేంద్ర వెంటనే తన స్నేహితుడు, మరో మహిళకు ఫోన్ చేశాడు. వారు ముగ్గురు కలిసి మృతదేహాన్ని కింది కారులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత వారిద్దరు వెళ్లిపోయారు.
మద్యం మత్తులో ఉన్న వీరేంద్ర కారును నడపడానికి ప్రయత్నించి.. విఫలమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ఇంట్లోకి వెళ్లిన వీరేంద్ర ఈసారి మరింత మద్యం తాగాడు.. ఇంటికి గడియ పెట్టి.. మరో ద్వారం నుంచి లోపలికి వెళ్లిపోయాడు. గురక పెట్టి నిద్రపోయాడు. చుట్టుపక్కల వారు కారులో శవాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వీరేంద్ర ఇంటికి వెళితే గడియ వేసి ఉంది. లోపలి నుంచి గురక శబ్దం వినిపించింది. దీంతో అనుమానం వచ్చి తలుపు తీయగా ఇంట్లో రక్తపు మరకలు కనిపించాయి. వీరేంద్ర ఆ మహిళను హత్య చేశాడని నిర్ధారించుకున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వీరేంద్రను అరెస్ట్ చేశారు. అతడికి సహకరించిన మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు..