Cyber Crime Alert : మీకు పార్సిల్ వచ్చింది.. మీరు పలానా కేసులో ఇరుక్కున్నారు.. మీ వాళ్ళు చీకటి వ్యవహారాలకు పాల్పడుతూ మాకు దొరికిపోయారు.. మేము ఫలానా ఖాతా నెంబర్ పంపిస్తాం దానికి డబ్బులు బదిలీ చేయండి.. ఇప్పటివరకు ఇలాంటి సైబర్ మోసాలనే మనం చూసాం. అయితే పోలీసులు అప్రమత్తమై అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో ఈ తరహా మోసాలు తగ్గిపోయాయి. అడ్డగోలు సంపాదనకు.. అక్రమంగా వెనకేసుకోవడానికి అలవాటు పడిన దుర్మార్గులు.. సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ఇప్పటివరకు రకరకాల భయాలను.. సున్నితమైన విషయాలను బయటపెడతామని సైబర్ మోసగాళ్లు డబ్బులు దండుకునేవారు. అయితే ఇప్పుడు తెరపైకి అవసరాన్ని తీసుకొచ్చారు. కొత్త ఎత్తుగడతో డబ్బులు దండుకునే ప్లాన్ మొదలుపెట్టారు.
Also Read : లక్షల్లో పొదుపు చేస్తే కోట్లల్లో లాభాలు.. చివరికి ఈ వృద్ధుడికి ఎలాంటి అనుభవం ఎదురైందంటే?
పోలీసులు ఎన్ని రకాలుగా ప్రజలకు అవగాహన కల్పించినప్పటికీ.. అక్రమంగా సంపాదించడానికి అలవాటు పడిన సైబర్ కేటుగాళ్లు ఏదో ఒక విధానంలో మోసానికి పాల్పడుతున్నారు. సరికొత్త ఎత్తుగడలతో ముంచడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.. తాజాగా హైదరాబాదులో వాటర్ బోర్డు వినియోదారులను మోసం చేయడానికి సైబర్ కేటుగాళ్లు సరికొత్త పన్నాగానికి పాల్పడ్డారు. నీటి బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగిస్తామని.. అలా జరగకూడదు అంటే మాకు ఫోన్ చేయాలని.. ఒక నెంబర్ మెసేజ్ చేస్తున్నారు. భయపడిన వినియోగదారులు వెంటనే ఆ నెంబర్ కి ఫోన్ చేయడంతో.. ఓటిపిని పంపిస్తున్నారు. ఎప్పుడైతే ఓటిపి వినియోగదారులు చెబుతారో.. అప్పుడే వారి వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఆ తర్వాత వారి వ్యక్తిగత వివరాలను.. బ్యాంకు వివరాలను సైబర్ నేరగాళ్లు సేకరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. వ్యక్తిగత ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇతర చీకటి వెబ్ సైట్ లో పెడతామని బెదిరిస్తున్నారు.. అయితే ఈ తరహా ఫిర్యాదులు రావడంతో సైబర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే హైదరాబాద్ నగర ప్రజలకు కీలక సూచనలు చేశారు.
” సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. అడ్డగోలుగా సంపాదించడానికి రకరకాల ప్రణాళికలు అమలు చేస్తున్నారు. గతంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు డిమాండ్ చేసేవారు. ఇప్పుడు ఏకంగా అవసరాలు ఆధారంగా ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. అంతేకాదు వారి దగ్గర నుంచి అత్యంత సులువుగా డబ్బులు లాగుతున్నారు. ఇలాంటి కేసులు ఇటీవల మా దృష్టికి వచ్చాయి. అందువల్లే ప్రజలను అప్రమత్తం చేయడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. సాధ్యమైనంతవరకు వాటర్ బిల్లులు చెల్లించాలి? రోడ్డు టాక్స్ లు కట్టాలి? అని సందేశాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు. అవసరమైతే అలాంటి మెసేజ్ మా దృష్టికి తీసుకురావాలి. వారిపై మేము చర్యలు తీసుకుంటామని” సైబర్ విభాగం పోలీసులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని.. ఎటువంటి వివరాలు, ఓటిపిలు ఇతరులకు చెప్పకూడదని సూచిస్తున్నారు.