Financial Success : అధికంగా సంపాదించాలి.. భారీగా వెనకేయాలి అనే ఆలోచనతో చాలామంది అసలు విషయాలను మర్చిపోతుంటారు. డబ్బు అనే మైకం వారిని కమ్మడం ద్వారా ఏం చేస్తున్నారో అనే సోయి కూడా వారికి ఉండదు. తీరా మోసపోయిన తర్వాత.. నిండా మునిగిన తర్వాత అసలు విషయం అర్థమవుతుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలాంటి సంఘటనలు సమాజంలో నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నప్పటికీ జనాల్లో మార్పు రావడం లేదు. పైగా భారీగా సంపాదించాలి అనే ఆలోచన లో వారు ఇవేవీ పట్టించుకోవడం లేదు.
ప్రస్తుత కాలంలో సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త దారుణాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినప్పటికీ.. అధునాతన సాంకేతిక పద్ధతులను అందుబాటులోకి తెచ్చినప్పటికీ సైబర్ నేరగాళ్లు రోజుకో తీరుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. వారికి మాయమాటలు చెప్పి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సమాజంలో మనుషుల్లో పెరిగిపోయిన డబ్బు యావ వల్ల ఎలా మోసపోతున్నారో కళ్లకు కట్టింది.
Also Read : మనల్ని ఎవడ్రా ఆపేది.. తాగండి.. కొట్టుకోండి.. మందుబాబుల రచ్చ
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వృద్ధుడు ఈ ఏడాది మార్చి నెలలో బుల్ మార్కెట్ ద్వారా ఎక్స్ పర్ట్స్ ప్రొ లిమిటెడ్ అనే సంస్థలో 21 వేలు ఇన్వెస్ట్ చేశాడు. కొద్దిరోజుల తర్వాత ఓ వ్యక్తి ఆ వృద్ధుడికి ఫోన్ చేశాడు. తను ఆ కంపెనీ ప్రతినిధినని చెప్పుకున్నాడు. తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే.. ఎక్కువ రిటర్న్స్ ఎలా సంపాదించాలో చెబుతానని చెప్పాడు.. మొదట్లో ఆ వృద్ధుడు అతడు చెప్పిన మాటలు నమ్మలేదు. అయితే అతడికి పదేపదే ఫోన్ చేయడం.. ఆర్థికపరమైన విషయాలను పూసగుచ్చినట్టు చెప్పడంతో ఆ వృద్ధుడు నమ్మాల్సి వచ్చింది. ఇక అంతర్జాతీయ స్టాక్.లో ఎలా పెట్టుబడులు పెట్టాలి… భారీగా ఎలా సంపాదించాలి అనే అంశాల గురించి ఆ వృద్ధుడికి ఆ వ్యక్తి చెప్పి మోసం చేశాడు.. ముందుగా లక్షల్లో పెట్టుబడులు చేస్తే కోట్లల్లో లాభాలు ఉంటాయని చెప్పడంతో.. ఆ వృద్ధుడు ముందు వెనక ఆలోచించకుండా 61.95 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఆ తర్వాత 75 వేల అమెరికన్ డాలర్లు బ్యాలెన్స్ ఉన్నట్టు ఆ వృద్ధుడి ఖాతాలో ఆ వ్యక్తి చూపించాడు. అయితే ఆ నగదును విత్ డ్రా చేసుకునే అవకాశం మాత్రం కల్పించలేదు. అయితే ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని ఆ వ్యక్తి వృద్ధుడిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో మోసపోయానని భావించిన ఆ వృద్ధుడు హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అతను చెప్పిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.