Crime News : పురాతన అక్షయపాత్ర( Akshaya Patra) మీ వద్ద ఉంటే లక్షల రూపాయలు అప్పనంగా వచ్చి పడతాయి. మీ ఇంట సంపదతో పాటు సిరులు వచ్చి చేరుతాయి. అంటూ ఓ ముఠా ఏకంగా 25 లక్షల రూపాయలు వల్లగొట్టేందుకు ప్లాన్ చేసింది. గతంలో ఇలాంటి అమ్మకాలు, కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తుల సహకారం తీసుకొని.. అక్షయపాత్ర పేరుతో జనంలో అత్యాశ వాడుకొని.. లక్షలు కొట్టేద్దాం అన్న ప్లాన్ బెడిసి కొట్టింది. అక్షయపాత్రతో డబ్బులు మాట ఎలా ఉన్నా.. ఆ ముఠా పోలీసులకు చిక్కడంతో.. వారంతా ఊచలు లెక్క పెడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన.
* మోసాలకు అంతే లేదు..
మోసపోయేవాడు ఉన్నంతవరకు మాసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. అక్షయపాత్ర పేరిట శ్రీకాకుళంలో( Srikakulam district) ఇటువంటి ఘరానా మోసం చేసేందుకు ఓ ముఠా సిద్ధపడింది. కానీ వారి గుట్టును రట్టు చేశారు శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి పోలీసులు. సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస లో రిజర్వాయర్ ప్రాంతం ఒకటి ఉంది. గత నెల వదిన కొంతమంది వ్యక్తులు అక్కడ అక్షయపాత్ర పేరిట అమ్మకాలు, కొనుగోలు జరుపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పదిమందిని అరెస్టు చేశారు. విశాఖకు చెందిన రవిశంకర్, రుద్రరాజు వెంకట రంగరాజు, కనకరాజు, రఘునాధ రావు, మురళీకృష్ణ, గరిక శ్రీను, కొండా వెంకట నాగ సత్యనారాయణ తదితరులు విశాఖ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవారు. కరోనా కారణంగా వ్యాపారంలో ఆర్థికంగా నష్టపోయారు. ఆ కష్టాల నుంచి గట్టెక్కే మార్గం కోసం ఆలోచించగా అక్షయపాత్ర గుర్తుకు వచ్చింది. అక్షయపాత్ర పేరు చెప్పి కొంత డబ్బు సంపాదించవచ్చని వారు భావించారు.
* ఓ ఇద్దరి సహకారంతో..
సాధారణంగా అక్షయపాత్ర ఇంట్లో ఉంటే సంపద పెరుగుతుందన్న నమ్మకం ఎప్పటినుంచో ఉంది. దానినే పెట్టుబడిగా మలుచుకోవాలని భావించారు వారంతా. దీంతో గతంలో ఇటువంటి పనుల్లో ఆరితేరిన.. రణస్థలం( rangasthalam ) మండలానికి చెందిన పూని భద్రయ్యను వారు ఆశ్రయించారు. రైస్ పుల్లింగ్ అక్షయపాత్రను వేరే వ్యక్తికి నమ్మించి 25 లక్షల రూపాయలకు విక్రయించేందుకు సిద్ధపడ్డారు. ఇంతలోనే పోలీసులకు సమాచారం అందింది. పోలీసుల విచారణలో మోసం అని తేలిపోయింది. పూని భద్రయ్యతో పాటు రాజు అనే వ్యక్తి కూడా ఈ ముఠాకు సహకరించినట్లు తేలింది. రైస్ పుల్లింగ్ అక్షయపాత్ర పేరిట ఎప్పటికప్పుడు మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నా.. ప్రజలు ఇంకా మోసానికి గురవుతూనే ఉన్నారు.