Furd
Furd: మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుంటాడు. అతడికి ఆ కంపెనీ 13 వేల జీతం చెల్లిస్తూ ఉంటుంది. అతడి వయసు కూడా 23 సంవత్సరాలు. ఇతడు డిగ్రీ దాకా చదువుకున్నాడు. సాంకేతిక అంశాలపై కాస్త పట్టు ఎక్కువ. దీంతో కంపెనీ యాజమాన్యం ఇతడిని పూర్తిగా నమ్మింది. బ్యాంకు ద్వారా నిర్వహించే ఆర్థిక లావాదేవీలకు ఇతడిని ఆ కంపెనీ యాజమాన్యం పంపేది. అయితే యాజమాన్యం బ్యాంకు ద్వారా నిర్వహిస్తున్న ఆర్థిక కలాపాలపై ఇతడికి కన్ను పడింది. ఆస్తమానం 13వేల జీతంతో ఎలా బతకాలనే నిట్టూర్పు అతడిని మోసానికి ఒడిగట్టేలా చేసింది. అంతిమంగా అతడు ఒక ప్రణాళిక రూపొందించాడు. కంపెనీని సర్వం ముంచే స్కెచ్ వేశాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు.
నకిలీ ఈమెయిల్ సృష్టించి..
తన పని చేస్తే సంస్థ పేరుతో ఆ వ్యక్తి నకిలీ ఈమెయిల్ సృష్టించాడు. అంతేకాదు పాత లెటర్ హెడ్ తో మెయిల్ మార్చాలని బ్యాంక్ అధికారులకు లేఖ రాశాడు. దీనిని నిజం అనుకొని ఆ బ్యాంక్ అధికారులు అతడు చెప్పినట్టే చేశారు. తను మోసానికి ఈ బ్యాంకింగ్ ను అనుకూలంగా మలచుకున్నాడు. సంస్థకు సంబంధించిన 21 కోట్లను పలు దఫాలుగా తన కుటుంబ సభ్యులు, ఇతరుల ఖాతాలకు బదిలీ చేశాడు. చివరగా తన స్నేహితురాలికి క్వాడ్రా ఫుల్ బెడ్ రూమ్ కొనుగోలు చేశాడు. ఒక కారు కూడా బహుమతిగా ఇచ్చాడు.. తాను చేస్తున్న మోసం బయటకు తెలియకుండా జాగ్రత్త పడేవాడు. కంపెనీ కూడా పసిగట్టకుండా పేదవాడిగా నటించేవాడు. అనుక్షణం అప్రమత్తంగా ఉండేవాడు. అయితే ఇటీవల కంపెనీలో ఆడిటింగ్ జరగగా ఇతగాడి మోసం వెలుగులోకి వచ్చింది.. దీంతో ఇన్నాళ్లు అమాయకుడిగా నటించి.. ఏకంగా 21 కోట్లను మోసం చేయడంతో ఆ కంపెనీ యాజమాన్యం విస్తు పోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు కూడా ఈ కేసు సవాల్ గా ఉండడంతో ఆర్థిక నిపుణులను సంప్రదించారు. వారు లోతుగా అధ్యయనం చేయగా ఇతగాడి మోసం వెలుగులోకి వచ్చింది. ఇదే క్రమంలో బ్యాంక్ అధికారులు కంపెనీ ద్వారా వచ్చిన లేఖలను పోలీసుల ఎదుట ప్రదర్శించడంతో.. ఆ ఉద్యోగి అసలు మోసం బయటపడింది. ఆ ఆధారాల ద్వారా పోలీసులు అతడిని అరెస్టు చేసి.. రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. అయితే అతడి నుంచి ఎంత మొత్తం రికవరీ చేశారనేది తెలియ రాలేదు. “ఆర్థిక వ్యవహారాలు సాగించేటప్పుడు యాజమాన్యాలు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులను నమ్మి కోట్లకు కోట్లు వారికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందువల్లే జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంతవరకు బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఉద్యోగులను దూరంగా ఉంచడమే మంచిదని” పోలీసులు చెబుతున్నారు.