Araku : అరకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. అరకు అందాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించే అద్భుత ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెలలో అరకు ఉత్సవ్ నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2014లో టిడిపి ప్రభుత్వం అరకు ఉత్సవ్ చేపట్టింది. ప్రతి సంవత్సరం నిర్వహించాలని నిర్ణయించింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి బ్రేక్ పడింది. ఇప్పుడు దానిని కొనసాగించాలని నిర్ణయించింది కూటమి సర్కార్. సాధారణంగా శీతాకాలంలో అరకు కు పర్యాటకుల తాకిడి ఎక్కువ. అరకు అందాలను వీక్షించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే ఈ రెండు నెలలపాటు ఎక్కువమంది అరకు టూర్ ప్లాన్ చేస్తుంటారు. మన్యంలో మదిని దోచే చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఆకాశానికి నిచ్చెన వేసి ఉంటుంది ఆ ప్రాంతం. అందుకే తెలుగు ప్రజలతో పాటు చత్తీస్గడ్, ఒడిస్సా నుంచి సైతం పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ ఏడాది అరకు ఉత్సవ్ నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రావడం విశేషం. ఒకటి కాదు రెండు కాదు మూడు కోట్ల రూపాయలతో ఈ ఉత్సవ్ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. పర్యాటకులకు ఆకట్టుకునేలా ఈ ఉత్సవ్ ఉండనుంది.
* పర్యాటకరంగ అభివృద్ధికి
అరకులో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న తలంపుతో టిడిపి ప్రభుత్వం అప్పట్లో అరకు ఉత్సవ్ నిర్వహించింది. 2019 వరకు ఐదేళ్లపాటు ఏటా నిర్వహిస్తూ వచ్చింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టిడిపి సర్కార్.. మరోసారి అరకు ఉత్సవ్ యధావిధిగా కొనసాగించాలని భావిస్తోంది. జనవరి 31 నుంచి మూడు రోజులపాటు ఈ ఉత్సవ్ నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. అయితే ఈ ఉత్సవాలు ప్రత్యేకంగా ఉంటాయి. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి.
* అన్నీ ప్రత్యేకమే
అరకు ఉత్సవ్ లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, హార్ట్ ఎయిర్ బెలూన్, రంగోలి పోటీలు, ఆటలు నిర్వహించనున్నారు. గిరిజనుల నృత్యమైన ధింసా, కోయ నృత్య ప్రదర్శనలు, పులి వేషాలు.. ఇలాంటి వెన్ను ఏర్పాటు చేయనున్నారు. సాధారణంగా శీతాకాలంలో అరకుకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అరకు ఉత్సవ్ తో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అరకు పర్యాటకులకు అధికారులు కీలక సూచనలు చేశారు. అరకు, బొర్రా గుహలను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా ప్రకటించామని.. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లను అనుమతించబోమని చెబుతున్నారు. పర్యాటకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నిబంధన జనవరి 1 నుంచి అమల్లోకి తేనున్నారు.