https://oktelugu.com/

Srikakulam : కాటు వేయలేదు.. పగబట్టి విషం చిమ్మనూలేదు.. రెండు నిండు ప్రాణాలను గాలిలో కలిపేసిన పాము..

కార్తీక పౌర్ణమి.. ఆ ఇంట్లో వారంతా దీపాలు వెలిగించారు. పండగ అంగరంగ వైభవంగా చేసుకున్నారు. పండగ సందర్భంగా ఇంట్లో వాళ్ళు రకరకాల పిండి వంటలు చేశారు. కొద్దిసేపయితే అందరూ తినేవారే. కానీ ఈలోగా జరిగిన ఒక సంఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 18, 2024 8:19 am

Crime News

Follow us on

Srikakulam : కార్తీక పౌర్ణమి రోజున తాచుపాము ఓ ఇంట్లో అంతులేని విషాదాన్ని నింపింది. అలాగని ఆ పాము కాటు వేయలేదు. పగబట్టి విషం చిమ్మలేదు. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం కనిమెట్టలో జరిగింది. కనిమెట్ట గ్రామంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం రాత్రి రఘుపతి మధుసూదన్ రావు అనే వ్యక్తి ఇంట్లోకి ఒక తాచుపాము వచ్చింది. అది అత్యంత పెద్దదిగా ఉండడంతో ఇంట్లో వాళ్ళు కేకలు వేశారు. భయంతో పరుగులు పెట్టారు. రాత్రి కావడంతో.. ఎవరైనా ఆదమర్చి ఉంటే కాటు వేస్తుందని భావించి మధుసూదన్ రావు ఆ పామును చంపడానికి కర్రతో గట్టిగా కొట్టాడు. అయితే ఆ దెబ్బ నుంచి తప్పించుకుని బావిలో దూకింది. అయితే ఆ బావిలో పాము అలాగే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమని భావించి మధుసూదన్ రావు, ఆయన కుటుంబ సభ్యులు బావి నుంచి నీరు మోటార్ ద్వారా బయటికి పంపించాలని భావించారు. శనివారం ఉదయం ఆ పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక శనివారం ఉదయం ఆ బావిలో నీటిని బయటికి పంపించడానికి సమాయత్తమయ్యారు. ఇంజన్ స్టార్ట్ చేశారు. నీళ్లు మొత్తం నిండుకుంటున్న సమయంలో ఇంజన్ ఒక్కసారిగా బావిలో పడిపోయింది.

బావిలో పడిపోయి..

బావిలో ఇంజన్ పడిపోవడంతో దానిని బయటకు తీయడానికి మధుసూదన్ రావు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఇంజన్ ను తీసుకొచ్చేందుకు బావిలోకి దిగాడు. అయితే అతడు ఎంతసేపటికి బయటకు రాలేదు. దీంతో మధుసూదన్ రావును కాపాడేందుకు ఆయన మేనల్లుడు కింతలి ఢిల్లేశ్వర రావు బావిలోకి దిగాడు.. అయితే ఆయన కూడా ఎంతసేపటికీ రాలేదు. అయితే కుటుంబ సభ్యులు బావిలోకి చూడగా ఇద్దరు విగత జీవులై కనిపించారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నా. దీంతో వారిద్దరి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. పండగ రోజు ఇద్దరూ చనిపోవడం.. వారిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో గ్రామంలో తీరని విషాదం నెలకొంది. అయితే ఆ బావిలో నీరు నిండుకోవడంతో గాలి సక్రమంగా ఆడలేదని.. పైగా బావి లోతున ఉండడంతో ఒత్తిడి అధికమై చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొందరేమో పాము కాటు వేయడం వల్లే అలా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదికలో విషం తాలూకు ఆనవాళ్లు వారి శరీరంలో కనిపించలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. కేవలం వత్తిడి.. ఊపిరి ఆడక పోవడం వల్లే వారు చనిపోయారని వైద్యులు వివరిస్తున్నారు.. అటు పాము కరవకపోయినా.. ఇద్దరు చనిపోవడం దిగ్భ్రాంతిని కలిగించిందని గ్రామస్తులు వాపోతున్నారు.