Borabanda Incident: అతడిలో అనుమానం రగిలింది. అది పెనుభూతం లాగా మారింది. అతడిని ఉన్మాదిలాగా మార్చింది. చివరికి అతడు పైశాచికంగా ప్రవర్తించి.. దారుణానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగలేదు. చేసిన దారుణాన్ని వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు. ఈ దారుణం హైదరాబాదు నగరం పరిధిలోని బోరబండ ప్రాంతంలో చోటుచేసుకుంది.
వనపర్తి జిల్లా చింతకుంట ప్రాంతానికి చెందిన ఆంజనేయులుకు కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన సరస్వతితో 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆంజనేయులు దంపతులకు ఇద్దరు సంతానం. స్వగ్రామంలో ఉపాధి లేకపోవడంతో బతుకుతెరువు కోసం వీరు హైదరాబాద్ వచ్చారు. బోరబండ ప్రాంతంలోని రహమత్ నగర్ డివిజన్ పరిధిలో రాజీవ్ గాంధీ నగర్ లో ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఆంజనేయులు కార్ల విక్రయాల వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. సరస్వతి ఎమ్మెల్యే కాలనీలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తోంది. కొంతకాలంగా సరస్వతిపై ఆంజనేయులు అనుమానం పెంచుకున్నాడు. ఆమెను నిత్యం వేధిస్తున్నాడు. ఫోన్ ఓపెన్ చేసి అన్ని పరిశీలిస్తున్నాడు. ఆమె పనిచేస్తున్న ప్రదేశానికి రహస్యంగా వెళ్లి పరిశీలించేవాడు. ఆంజనేయులు వ్యవహార శైలిని చూసి తట్టుకోలేక సరస్వతి అనేక సందర్భాలలో నిలదీసింది. అయినప్పటికీ అతని ప్రవర్తన మారలేదు. దీంతో సరస్వతి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇదే క్రమంలో ఆంజనేయులు అత్తవారింటికి వెళ్లి పెద్ద మనుషులతో మాట్లాడాడు. సక్రమంగా ఉంటానని చెప్పి భార్యను రాజీవ్ గాంధీ నగర్ తీసుకొచ్చాడు. రాజీవ్ గాంధీ నగర్ తీసుకొచ్చినప్పటికీ భార్య మీద ఏ మాత్రం కోపాన్ని తగ్గించుకోలేదు ఆంజనేయులు. సోమవారం అర్ధరాత్రి తన పిల్లలతో కలిసి గాఢమైన నిద్రలో సరస్వతి ఉండగా.. రోకలి తో తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత ఆంజనేయులు అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సరస్వతిని చంపిన తర్వాత వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు.