Kukatpally Incident: చేసేది తప్పు అని తెలుసు. అది అనైతికం అని కూడా తెలుసు. కానీ, తప్పు చేస్తున్నామనే భావన ఏమాత్రం లేదు. అనైతికానికి పాల్పడుతున్నామనే అపరాధ భావం ఏ కోశాన కూడా లేదు. పైగా, దారుణాలకు పాల్పడుతున్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకుని.. ఘోరాలు చేస్తున్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నప్పటికీ చాలామందిలో మార్పు రావడం లేదు. పైగా సినిమాలకు మించిన స్థాయిలో నేరాలకు పాల్పడుతుండడం సభ్య సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తుంది.
హైదరాబాదులోని కూకట్ పల్లి ప్రాంతంలో ఒక దారుణం చోటుచేసుకుంది. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద నగర్ ప్రాంతంలో సుధీర్ రెడ్డి, బ్రహ్మ జ్ఞాన ప్రసన్న అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇంటర్, ఐదవ తరగతిలో చదివే కుమారులు ఉన్నారు. సుధీర్ రెడ్డి స్వస్థలం నూజివీడు. సుధీర్ రెడ్డి ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు.. జ్ఞాన ప్రసన్న గృహిణిగా ఉంది. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలకు ప్రధాన కారణం ప్రసన్న వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం.. భార్య అలా చేస్తుండడాన్ని తట్టుకోలేక సుధీర్ రెడ్డి అనేక పర్యాయాలు ప్రశ్నించాడు.. ప్రవర్తన మార్చుకోవాలని సూచించాడు. అయినప్పటికీ ప్రసన్న పట్టించుకోలేదు. పైగా భర్తతో తరచూ గొడవపడేది.
ఇటీవల సుధీర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంట్లో ఉన్న మంచం కోడు తలకు గట్టిగా తగలడంతో చనిపోయాడని ప్రసన్న పోలీసులకు చెప్పింది. ఆ సమయంలో తన భర్త మద్యం మత్తులో ఉన్నాడని చెప్పింది. ఆమె చెప్పిన విషయాలను పోలీసులు అంతగా నమ్మలేదు. సుధీర్ రెడ్డి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసి.. అతడి మృతి మీద అనుమానాలు ఉన్నాయని చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఆ తర్వాత సుధీర్ రెడ్డి మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం నివేదికను కూడా పరిశీలించారు. అందులో అతని గొంతు నులిమినట్టు ఆధారాలు లభించాయి. వైద్యులు కీలక నివేదిక ఇవ్వడంతో.. పోలీసులు ప్రసన్నను విచారించారు. దీంతో ఆమె నిజం ఒప్పుకుంది. ప్రియుడు సహకారంతోనే ఇదంతా చేసినట్టు వెల్లడించింది. ప్రసన్నతో పాటు ఆమె ప్రియుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు తండ్రి చనిపోవడం.. ఇటు తల్లి జైలుకు వెళ్లడంతో.. ఆ పిల్లలిద్దరూ అనాధలు అయిపోయారు.