Big Twist In Tejeshwar Case: గద్వాల జిల్లాలో తేజేశ్వర్ కేసు కూడా నేరకథ చిత్రాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. పైగా ఇందులో ఉన్న మలుపులు పోలీసులకు సైతం షాక్ కలిగిస్తున్నాయి. విచారణ నిమిత్తం పోలీసులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను ప్రశ్నించినప్పుడు.. వారు వెల్లడించిన విషయాలు పోలీసులను దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి.. ఇక పరారీలో ఉన్న మేనేజర్ తిరుమలరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అతడిని కూడా వారిదైన శైలిలో విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో అంతకంతకు అంచనాలకు అందని విషయాలు తెలుస్తున్న నేపథ్యంలో పోలీసులు మరికొద్ది రోజుల పాటు నిందితులను విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది..
రుణం కోసం వచ్చిన వ్యక్తితో..
తేజేశ్వర్ ను అంతం చేయడానికి తన బ్యాంకుకు రుణం కోసం వచ్చిన నగేష్ అనే వ్యక్తితో తిరుమలరావు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. తన మొదటి భార్యను కూడా అంతం చేయాలని అతడు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఎందుకంటే మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో ఆమెను హతమార్చి ఐశ్వర్యం రెండవ పెళ్లి చేసుకోవాలని తిరుమలరావు భావించాడు. అంతేకాదు బ్యాంకులో 20 లక్షల లోన్ కూడా తీసుకున్నాడు. ఐశ్వర్య ను వివాహం చేసుకున్న తర్వాత లడ్డాక్ ప్రాంతంలో నివాసం ఉండాలని అనుకున్నాడు. అంతకుముందే ఐశ్వర్య తల్లితో తిరుమలరావుకు వివాహేతర సంబంధం ఉంది. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఐశ్వర్య కు దగ్గరయ్యాడు. ఆశ్చర్యను పెళ్లి చేసుకోవాలని భావించాడు. కానీ ఈ లోగానే ఐశ్వర్య తల్లి తేజేశ్వర్ తో సంబంధం కుదిర్చింది. అంతేకాకుండా తిరుమల రావు తోనే ఆమె తన సంబంధాన్ని కొనసాగించాలని భావించింది. అయితే ఈ విషయం తిరుమలరావుకు ఆలస్యంగా తెలిసింది. దీంతో ఐశ్వర్యను అతడు నిలదీశాడు. తేజేశ్వర్ తో వివాహం కుదిరిన తర్వాత.. ఐశ్వర్య తిరుమలరావుతో ఐదు రోజులపాటు వెళ్లిపోయింది. ఐదు రోజుల వారిద్దరు దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు.. చివరికి ఐశ్వర్య వివాహం తేజేశ్వర్ తో జరిగింది. వివాహం జరిగిన నెల రోజుల్లోనే అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది.
జిపిఎస్ అమర్చింది
తేజేశ్వర్ రాకపోకల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అతని వాహనానికి జిపిఎస్ పరికరాన్ని ఐశ్వర్య అమర్చింది. అతడి గురించి ఎప్పటికప్పుడు తిరుమల రావుకు తెలియజేసింది. తిరుమలరావు తో ఏకంగా 2000 సార్లు ఐశ్వర్య మాట్లాడింది. పోలీసులకు కాల్ డాటా కీలక ఆధారంగా లభించింది. దీని ద్వారా వారు విచారణ సాగించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే తేజేశ్వర్ అంతమైన తర్వాత తిరుమలరావు పరారీలో ఉన్నాడు. అతని జాడను పోలీసులు కనుగొన్న తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అతడు చెప్పిన వివరాలను కూడా నమోదు చేసుకున్నారు. మొత్తంగా ఐశ్వర్య, తిరుమల రావు అత్యంత పాశవికంగా తేజేశ్వర్ ను అంతం చేశారు..