Bhimavaram:అమ్మాయి మిస్సింగ్.. అమెజాన్లో షాపింగ్.. చివరికి ఆచూకీ దొరికిందిలా..

జూన్ 22న మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరానికి చెందిన శివకుమారి " నా కుమార్తె అదృశ్యమై 9 నెలలవుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 3, 2024 3:02 pm

Bhimavaram

Follow us on

Bhimavaram: పోలీసులు తమ కర్తవ్యాన్ని ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా నిర్వహిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో నిరూపించే సంఘటన ఇది. కుమార్తె జాడ తెలియక తొమ్మిది నెలలుగా కంటికి ధారగా విలపిస్తున్న ఆ కన్నతల్లికి న్యాయం చేయలేకపోయిన పోలీసులు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో వేగంగా కదిలారు.. చిన్న క్లూ దొరకడంతో.. దాని ఆధారంగా దర్యాప్తు జరిపి కేవలం పది రోజుల్లోనే అమ్మాయి ఆచూకీ కనిపెట్టారు.. దీంతో ఆ కన్నతల్లి ఆనందానికి అవధులు లేవు. సినిమా స్టోరీకి తీసిపోని ఈ ఉదంతంలో ఎన్నో ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. ఇంతకీ ఆ అమ్మాయిని పోలీసులు ఎలా కనిపెట్టారంటే..

జూన్ 22న మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరానికి చెందిన శివకుమారి ” నా కుమార్తె అదృశ్యమై 9 నెలలవుతోంది. ఇంతవరకు ఆమె ఆచూకీ లభించలేదు. న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరిగాను. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి నా చెవి దిద్దులు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని” పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు.. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా పరిగణించారు. వెంటనే ఆయన మాచవరం సిఐ గుణ రామకృష్ణకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పారు. అమ్మాయి ఆచూకీ తెలుసుకోవాలని.. దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో ఆ అమ్మాయి ఆచూకీ తెలుసుకునేందుకు విజయవాడ నగర సిపి పీహెచ్ డీ రామకృష్ణ ఏకంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు.

శివకుమారి – ప్రభాకర్ దంపతులది భీమవరం పట్టణం. వీరికి ఇద్దరూ అమ్మాయిలు. వారిలో చిన్నమ్మాయి తేజస్విని విజయవాడలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచవరంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుతోంది. ఇదే క్రమంలో అ కళాశాల చెందిన విద్యార్థి, విజయవాడలోని నిడమానూరు ప్రాంతానికి చెందిన అంజాద్ అలియాస్ షన్ను తేజస్వినిని ప్రేమ పేరుతో బుట్టలో వేసుకున్నాడు. ఆమెను లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్ 28న ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి పలు ప్రాంతాల్లో వారిద్దరూ తిరిగారు. డబ్బులు లేకపోవడంతో తేజస్విని ఒంటిపై ఉన్న నగలు అమ్మాడు. చివరికి ఫోన్ కూడా విక్రయించాడు. కేరళ, ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో తిరిగి.. చివరికి జమ్మూ చేరుకున్నారు. అక్కడ ఓ హోటల్లో అంజాద్ పనిచేస్తున్నాడు. తేజస్వినిని మాత్రం ఇంట్లోనే ఉంచేవాడు. బయటికి అసలు రానిచ్చేవాడు కాదు. తన ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసుకుంటానని చెప్పినప్పటికీ ఒప్పుకునేవాడు కాదు. దీంతో ఒకరోజు అంజాద్ ఇంట్లో లేని సమయంలో అతడి ఫోన్ నుంచి తేజస్విని తన అక్కకు ఇన్ స్టా గ్రామ్ లో సందేశం పంపింది.

ఈ విషయాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తేజస్విని సోదరి చెప్పింది. దీంతో ఆ వివరాల ఆధారంగా పోలీసులు లోకేషన్ ట్రేస్ చేస్తే విదేశాలను చూపించింది
. దీంతో పోలీసులు ఒక్కసారిగా నిరుత్సాహపడ్డారు. అంజాద్ నెంబర్ తెలియకపోవడంతో పోలీసులు ఆచూకీ ఎలా కనుక్కోవాలో తెలియక తీవ్ర ఇబ్బంది పడ్డారు. పైగా తేజస్వినికి తాము ఎక్కడ ఉంటున్నామో కూడా తెలియదు. ఇదే క్రమంలో తేజస్విని తాము ఇటీవల అమెజాన్ నుంచి కొనుగోలు చేసిన ఫోటో ఫ్రేమ్ ను తన అక్కకు మేసేజ్ రూపంలో పంపింది. ఆ అడ్రస్ ద్వారా పోలీసులు వారిద్దరూ జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు. ఆ చిరునామాను ఇక్కడి పోలీసులు జమ్మూ పోలీసులకు పంపించారు. దీంతో అక్కడి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. వారు బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో మరి కాసేపట్లో విజయవాడకు రానున్నారు.

9 నెలలుగా తన కుమార్తె కనిపించడం లేదని శివకుమారి కలవని పోలీస్ అధికారి లేడు. తిరగని పోలీస్ స్టేషన్ లేదు. చివరికి తన చెవికి ఉన్న బంగారు దిద్దులను కూడా అమ్ముకొని పోలీసుల కాళ్లా వెళ్ళా పడింది. అయినప్పటికీ వారు పట్టించుకోలేదు. అప్పటి అధికార పార్టీ నాయకులకు విన్నవించినప్పటికీ వారు వినిపించుకోలేదు. చివరికి ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి రావడం.. ఆయన నేరుగా స్పందించడం.. పోలీసులు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో.. తేజస్విని ఆచూకీ లభించింది. పోలీసులపై ఎటువంటి రాజకీయ ఒత్తిడి ప్రయోగించకుండా.. వారి పనిని వారు చేసుకొనిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో మరోసారి ఈ సంఘటన నిరూపించింది. మరోవైపు ఆ యువతిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు కృషిచేసిన సిపి రామకృష్ణను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పోలీస్ కమిషనర్ తో మాట్లాడారు. ” తేజస్వినిని కిడ్నాప్ చేశారా” అని అడిగితే… పూర్తి వివరాలు త్వరలో చెబుతామని కమిషనర్ పవన్ తో అన్నారు.