https://oktelugu.com/

Medak : తాగిన మైకంలో మనుషులమనే సంగతి మరిచిపోయారు.. మతిస్థిమితం లేని వ్యక్తిపై దారుణం

అతడు ఎక్కడ పుట్టాడో తెలియదు. ఏ ప్రాంతమో అంతకన్నా తెలియదు. చిరిగిన దుస్తులు, మాసిన గడ్డం.. మతిస్థిమితం లేదు. అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోడ్డుపైనే తల దాచుకుంటున్నాడు. వర్షం వస్తే స్థానికంగా ఉన్న బస్టాండ్ లో పడుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి ఇటీవల చనిపోయాడు. మొదట అతడిది సాధారణమైన మరణం అనుకున్నారు. కానీ తర్వాత చూస్తే తెలిసింది.. అతనిపై సాటి మనుషులు అమానవీయ ఘటనకు పాల్పడ్డారని..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 10, 2024 4:49 pm
    Insane person

    Insane person

    Follow us on

    A Beggar Murder In Medak  : ఇటీవల మెదక్ జిల్లాలో మతిస్థిమితం లేని వ్యక్తి చనిపోయాడు. మొదట్లో అతడి మరణాన్ని సహజమైనదిగా భావించారు. అయితే పోలీసులు విచారణ నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో మతిస్థిమితం లేని 40 సంవత్సరాల వ్యక్తి కొంతకాలంగా ఇక్కడే భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు.. అతడికి హిందీ తప్ప మరో భాష రాదు. ఈనెల 4న అతడు బస్టాండ్ లో పడుకున్నాడు. అతడు దొంగతనం చేశాడని భావించి రాత్రి 11:30 నిమిషాల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన గంగిరెడ్డి తిరుపతిరెడ్డి, పందికొక్కుల మణికంఠ గౌడ్ దాడి చేశారు. ఆ సమయంలో వారు మద్యం తాగి ఉన్నారు.. ఆ మైకంలో అతడిని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. అతనిపైకి బైక్ ఎక్కించారు. తనను కొట్టొద్దని అతడు బతిమిలాడినప్పటికీ వారు కనికరించలేదు. పైగా పైకి లేపి కింద పడేశారు. ద్విచక్ర వాహనానికి అతనిని కట్టేసి ఈడ్చుకు వెళ్లారు. చనిపోయాడని భావించిన తర్వాత వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు మొత్తం బస్టాండ్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. అయితే మొదట్లో అతడిది సహజ మరణం అని కొంతమంది భావించారు. అయితే కొంతమంది గ్రామస్తులు మాత్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

    నిందితులను కాపాడేందుకు..

    మతిస్థిమితం లేని ఆ వ్యక్తి మరణాన్ని పోలీసులు ముందుగా సాధారణ మృతిగానే కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసు దర్యాప్తు చేయడంతో సంచలన విషయాలు వెళ్లడయ్యాయి. ఆ తర్వాత నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ వ్యక్తికి శివపరీక్ష నిర్వహించారు. మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే ఈ కేసులో అసలు నిజం సీసీ కెమెరాలో రికార్డు అయినప్పటికీ.. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు జపం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. విచారణ నిమిత్తం నిందితులను తీసుకెళ్లినప్పటికీ.. ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి తీసుకురావడంతో తిరిగి పంపించాలని ఆరోపణలు ఉన్నాయి. ఐదవ తేదీన ఈ ఘటన వెలుగులోకి రాగా.. తొమ్మిదో తేదీన నిందితులను పోలీసులు అరెస్టు చేయడం.. మణికంఠ గౌడ్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ఓ నాయకుడికి చెందిన యువజన విభాగంలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. తిరుపతి రెడ్డి ట్రాక్టర్ నడుపుతూ జీవిస్తున్నాడు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు నామమాత్రంగా వెల్లడించడం పలు ఆరోపణలకు తావిస్తోంది. అయితే దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఒక మనిషిని అత్యంత అమానవీయంగా చంపినప్పటికీ.. నిందితులపై సకాలంలో పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పట్ల మండిపడుతున్నారు.. ఇప్పటికైనా పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.