Darshan: జైళ్లో వేసినా బుద్ధి రాలేదు.. ఇతడినా కన్నుడిగులు ఆరాధ్య నటుడిగా భావించేది?

Darshan: అభిమానిని హత్య చేసిన కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కన్నడ నటుడు దర్శన్.. ప్రస్తుతం విచారణ ఖైదీగా ఉన్నాడు. అతడు పరప్పన అగ్రహార కేంద్ర కారగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఉన్నట్టుండి అతడిని బళ్లారి జైలుకి తరలించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 28, 2024 11:00 am

Darshan

Follow us on

Darshan: తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేశాడనే దర్శన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఒక సాహనాటితో అతడు సహజీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఆమెను రేణుకా స్వామి బెదిరించాడు. దీంతో ఈ విషయం ఆమె దర్శన్ కు చెప్పింది. పట్టలేని ఆగ్రహంతో దర్శన్ అతడిని హతమార్చాడనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు పక్కా ఆధారాలతో దర్శన్, అతడికి సహకరించిన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత వారిని తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్శన్, ఇతర వ్యక్తులు విచారణ ఖైదీలుగా ఉన్నారు.. ఈ క్రమంలో దర్శన్ విచారణ ఖైదీగా ఉన్న పరప్పన అగ్రహార కేంద్రకారాగారంలో అతడికి అద్భుతమైన మర్యాదలు దక్కుతున్నాయట. ఇందుకు సంబంధించిన ఆరోపణలు సోషల్ మీడియాలో చర్చనీయాంశాలుగా మారాయి.

ఈ నేపథ్యంలో దర్శన్ ను అక్కడి నుంచి బళ్లారి జైలుకు అధికారులు తరలించారు.. బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు అతని బల్లారి జైలుకు పంపించారు. మిగతా నిందితులను కర్ణాటకలోని ఇతర కారాగారాలకు పంపించారు. పరప్పన అగ్రహార జైల్లో దర్శన్ కు లభిస్తున్న సౌకర్యాలకు సంబంధించిన దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాలలో విస్తృత వ్యాప్తిలో ఉన్నాయి. దీంతో అతడిని బళ్ళారి జైలుకు పంపించినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం.. దర్శన్ తన జైలు బ్యారక్ నుంచి బయటకు వచ్చాడు. తన స్నేహితులతో కూర్చొని కాఫీ తాగాడు. సిగరెట్ కాల్చాడు. అయితే ఆ బ్యారక్ లో వేలు అనే రౌడీషీటర్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ దృశలను అత్యంత రహస్యంగా తన ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ తర్వాత వాటిని తన భార్యకు పంపించాడు. దర్శన్ తో కలసి కాఫీ తాగిన వారిలో రౌడీషీటర్ విల్సన్ గార్డెన్ నాగ కూడా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు దర్శన్ 25 సెకండ్ల పాటు అవతలి వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దీంతో జైల్లో అతడికి దర్జాగా సౌకర్యాలు అందుతున్నాయని బెంగళూరు కోర్టు ఒక అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో అతడిని బళ్లారి జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు అతడిని బళ్లారి జైలుకు పంపించారు. అయితే దర్శన్ కు ఈ స్థాయిలో సౌకర్యాలు లభించడం వెనక ఏడుగురు పోలీసు అధికారులు ఉన్నారని తెలుస్తోంది. వారిపై జైళ్ల శాఖ సస్పెన్షన్ వేటు విధించింది. కాగా, దర్శన్ జైళ్లో వ్యవహరిస్తున్న తీరు పట్ల సామాన్య ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి సమాజానికి ఎలా ఆదర్శం అవుతాడని ప్రశ్నిస్తున్నారు. తన అభిమానిని చంపి జైలు శిక్ష అనుభవిస్తున్నా కూడా బుద్ధి రావడం లేదని వాపోతున్నారు.