Vidadala Rajini: సజ్జల ప్లేసులో విడదల రజిని.. జగన్ భారీ స్కెచ్!

వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయనదే పైచేయిగా నిలిచింది. చివరకు అత్యంత కీలకమైన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పదవిలోనూ తన కుమారుడిని కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడు ఆ పోస్ట్ ఓడిపోయే అవకాశం ఏర్పడింది.

Written By: Dharma, Updated On : August 28, 2024 10:55 am

Vidadala Rajini

Follow us on

Vidadala Rajini: వైసిపి సోషల్ మీడియా ఇన్చార్జిగా సజ్జల భార్గవరెడ్డిని తప్పించాలని చూస్తున్నారు జగన్. తొలుత నాగార్జున యాదవ్ పేరును పరిశీలించారు. తరువాత తన సమీప బంధువు ఒకరిని తెరపైకి తెచ్చారు. కానీ అధికారికంగా ఇంతవరకు బాధ్యతలు అప్పగించలేదు. మరోవైపు సజ్జల భార్గవ రెడ్డి కూడా బయట ప్రపంచానికి కనిపించడం లేదు.కేసులకు భయపడి ఆయన విదేశాలకు వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చే పనిలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. పవర్ ఫుల్ వ్యక్తి అయితేనే ఈ ఐదేళ్ల పాటు ధైర్యంగా సోషల్ మీడియాను నడిపించగలరని జగన్ భావిస్తున్నారు. 2014 నుంచి 2019 మధ్య సోషల్ మీడియా ఇన్చార్జిగా విజయసాయిరెడ్డి ఉండేవారు. అప్పట్లో ఆయన చాలా యాక్టివ్ గా పని చేశారు. పార్టీ బాధ్యతలతో పాటు సోషల్ మీడియా విభాగాన్ని చక్కగా నడిపించారు. అప్పట్లో ఉన్న టిడిపి ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచడంలో సోషల్ మీడియా బాగానే పనిచేసింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆలోచనలకు తగ్గట్టు సోషల్ మీడియా నడుచుకునేది. అయితే పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎంట్రీ తర్వాత.. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం బాధ్యతలతో పాటు సోషల్ మీడియా విభాగాన్ని హస్తగతం చేసుకోవాలని భావించారు. ఆ విధంగా పావులు కలిపారు. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్చార్జిగా పంపించారు.కేంద్ర కార్యాలయం బాధ్యతలను సజ్జల తీసుకున్నారు. తరువాత సోషల్ మీడియా బాధ్యతలను తన కుమారుడు భార్గవ రెడ్డికి అప్పగించారు.

యువనేత ఫెయిల్యూర్
అయితే వైసిపి సోషల్ మీడియా విభాగాన్ని విజయవంతంగా నడపలేకపోయారు సజ్జల భార్గవ్ రెడ్డి. ఓ నలుగురిని పెట్టుకుని తన సొంత ఎజెండాతో ముందుకెళ్లారు. అనుకున్నట్టుగా ముందడుగు వేయలేకపోయారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమితో సజ్జల భార్గవ్ రెడ్డి చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైసిపి కి ఓటమి అని సీనియర్ నేతలు భావించారు. ఇదే అభిప్రాయం సర్వత్ర వ్యక్తం కావడంతో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పార్టీలో యాక్టివ్ నెస్ తగ్గించారు.

* కేసుల భయంతో అజ్ఞాతంలోకి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల భార్గవరెడ్డిని టార్గెట్ చేసుకుంది. కేసులు నమోదు చేయాలని భావించింది. పాత కేసులను తిరగతోడింది. ఇది తెలిసి సజ్జల భార్గవ్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విదేశాలకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పదవికి కొత్త వారి కోసం జగన్ అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున యాదవ్ పేరు వినిపించింది. అమెరికాలో ఉన్న జగన్ బంధువు పేరు కూడా ఖరారు అయినట్లు ప్రచారం జరిగింది.

* తెరపైకి కొత్త ఇన్చార్జ్
ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి విడుదల రజిని అయితే సరిపోతారని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు విడుదల రజిని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. పార్టీ విధానాలను తీసుకెళ్లారు. ఆమెకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తే కొంత ఖర్చు తగ్గడంతో పాటు పార్టీ సేవలు మెరుగుపడతాయని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి తన కుమారుడికి ఆ పదవి ఉండాలని ఆరాటపడుతున్నట్లు సమాచారం. అయితే విడదల రజిని సైతం సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం కావడంతో ఆయన సైతం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.