Cyber Crime : ఇంటివద్దే పనిచేయండి. ప్రతినెలా వేలు సంపాదించండి. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. చెమట చుక్క చిందించాల్సిన పనిలేదు. బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు. దర్జాగా వెనకేసుకోవచ్చు.. ఇలాంటి ప్రకటనలు మనం చూస్తూనే ఉంటాం. ఇందులో మెజారిటీ ప్రకటనలు మోసపూరితమైనవే ఉంటాయి. అయితే ప్రజల్లో చైతన్యం పెరగడంతో మోసగాళ్లు సరికొత్త ఎత్తుగడలకు తెరదీశారు. ఎవరూ ఊహించని దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మీరు చదువబోయే కథనం కూడా అలాంటిదే. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఇటీవల ఒక ఫోన్ వచ్చింది. అవతల వైపు మాట్లాడింది ఓ యువతి. మీ పేరు? మీ వయసు? ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? మీకు రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నాయా? మీకు వివాహం జరిగిందా? మీ వీర్యంలో నాణ్యత ఎంత? ఇలాంటి ప్రశ్నలు అడగగానే.. ఆ యువకుడు సమాధానం చెప్పాడు. మీరు మేము అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పారు. మీరు ధనవంతుల పిల్లలకు గర్భధారణ చేయడానికి ఎంపికయ్యారు. ఒక అమ్మాయికి గర్భధారణ చేస్తే మీకు ఐదు లక్షలు ఇస్తామని ఆ యువతి చెప్పింది. దీంతో అతడు ఎగిరి గంతులేశాడు. ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది.
ముందుగా మీరు మీ పేరు ఎంట్రీ చేయించుకోవాలంటే 10,000 ఇవ్వాలని ఆ యువతి కోరింది. దానికి అతడు ఆమె చెప్పిన ఖాతాకు 10,000 పంపించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మీరు విదేశాలకు వెళ్లాలి.. వీసా ఖర్చులకు డబ్బులు పంపాలంటే.. అతడు అదే విధంగా చేశాడు. ఇక ముచ్చటగా మూడోసారి మూడు లక్షలు ఇస్తేనే మీకు ఆ అవకాశం లభిస్తుందని ఆ యువతి చెప్పింది. దీంతో ఏదో మోసం లాగా ఉందని భావించిన ఆ యువకుడు.. వెంటనే తాను డబ్బు చెల్లించిన ఖాతా నెంబర్లు.. మాట్లాడిన ఫోన్ నెంబర్.. ఇతర వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ” అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ ఎత్తకూడదు. వారితో ఎటువంటి లావాదేవీలు నిర్వహించకూడదు. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారు . వారి వలలో చిక్కి మోసపోవద్దని” పోలీసులు యువతకు సూచిస్తున్నారు. కాగా, ఇటీవల కాలంలో ఈ తరహా ఫిర్యాదులు తమకు ఎక్కువగా వస్తున్నాయని ఉత్తర ప్రదేశ్ పోలీసులు చెబుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వారిలో అధిక శాతం 20 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్న యువకులే ఉండడం విశేషం. అయితే కొన్ని పెద్దల చిత్రాలు ప్రదర్శించే సైట్లలో యువకులు తమ ఫోన్ నెంబర్లను ఎంట్రీ చేయడం ద్వారా.. ఇలాంటి మోసగాళ్ల బారిన పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.