Karimnagar: డబ్బుతోనే అన్ని పనులు జరుగుతాయి. ఒక మనిషి పుట్టుక నుంచి మొదలు పెడితే చావు వరకు ప్రతిదీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అలాంటప్పుడు ఆ డబ్బు కోసం కష్టపడి పని చేయాలి. నిజాయితీగా వ్యవహరించాలి. అప్పుడే మనం సంపాదించిన సంపాదనకు సార్ధకత ఉంటుంది. కానీ కొంతమంది డబ్బు సంపాదన విషయంలో అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతుంటారు. నీతి, నిజాయితీ అనే విషయాలను పక్కనపెట్టి.. దారుణంగా వ్యవహరిస్తుంటారు. ఉచ్ఛ నీచాలు మరిచిపోయి.. మానవత్వానికి మచ్చ తీసుకొస్తుంటారు. చివరికి మనిషి పుట్టుక మీద ఏవగింపు కలిగేలా చేస్తారు. అటువంటి సంఘటన మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట మండలంలోని వెంకటరావుపేటలో చోటుచేసుకుంది.
ఏం జరిగిందంటే..
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం వెంకటరావుపేట గ్రామానికి చెందిన ఓ 31 సంవత్సరాల వ్యక్తి కరీంనగర్లో స్థిరపడ్డాడు. మార్బుల్ వ్యాపారం చేసేవాడు. ఇంటీరియర్ డెకరేషన్ కూడా చేసేవాడు. ఇతడికి మంచిర్యాల ప్రాంతానికి చెందిన 29 సంవత్సరాల మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా.. ఆ వ్యక్తికి వ్యాపారంలో విపరీతంగా నష్టం వచ్చింది. తీసుకున్న రుణాలు, ఈఎంఐ లు చెల్లించడం ఇబ్బందిగా మారింది. దీంతో భార్యతో సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టించడం మొదలుపెట్టాడు.
వలలో పడ్డారు
ఆమె రెచ్చగొట్టే పోస్టులను చూసిన కొంతమంది వ్యాపారులు, యువకులు వలలో పడ్డారు. వారిని ఆమె తమ అపార్ట్మెంట్ కు పిలిపించేది. వారితో అత్యంత సన్నిహితంగా ఉండేది. అలా వారు ఉన్న దృశ్యాలను ఆమె భర్త వీడియోలు తీసేవాడు. ఆ తర్వాత బాధితులకు ఫోన్లు చేసి వీడియోలు పంపించేవాడు. వాటిని అందరికీ పంపిస్తామని బెదిరించేవాడు. ఇలా గడిచిన మూడు సంవత్సరాల కాలంలో సుమారు వందమందికి పైగా పురుషులను బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. చివరికి కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఒక లారీ వ్యాపారిని సైతం హెచ్చరించారు. 13 లక్షలు దండుకున్నారు. అదనంగా మరో ఐదు లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దంపతులను అరెస్టు చేశారు.
ఖరీదైన జీవితం
ఇలా వసూలు చేసిన డబ్బులతో ఆ దంపతులు అత్యంత ఖరీదైన జీవితాన్ని అనుభవించడం మొదలుపెట్టారు. కారు కొనుగోలు చేశారు. ఖరీదైన కుర్చీలు, సోఫా సెట్లు, ఫర్నిచర్ వంటి వాటిని సమకూర్చుకున్నారు.. అంతేకాదు, కరీంనగర్ జిల్లా చెందిన ఓ వ్యాపారిని వశం చేసుకున్న ఆ మహిళ.. అతడు మద్యం మత్తులో ఉన్నప్పుడు భారీగా డబ్బు లాగింది.. ఈమె మాయలో పడి అతడు ఉన్నది మొత్తం కోల్పోయాడు. డబ్బు లేకపోవడంతో ఆమె వద్దకు రావడం మానేశాడు. దీంతో అతడికి ఆమె వాట్సప్ కాల్ చేసి ” నువ్వు నా దగ్గరికి ఎందుకు రావడం లేదు..నువ్వు రాకపోతే ఏదో విధంగా ఉందని” ఆ వ్యక్తితో ఆ మహిళ పేర్కొంది. ” నా దగ్గర డబ్బులు అయిపోయాయి. నావల్ల కావడం లేదంటూ” ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో అతడి నుంచి మరింత డబ్బు లాగడానికి ఆ మహిళ అతనితో ఉన్న సన్నిహిత వీడియోలను పంపింది. దీంతో అతడు తట్టుకోలేకపోయాడు. అతడు కూడా పోలీసులకు తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ భార్యాభర్తలు ఎన్నో దారుణాలకు పాల్పడ్డారు. చివరికి వారి బూతు బాగోతం బయటపడటంతో మొత్తానికి జైలు పాలయ్యారు.