Bengaluru: ఒక విద్యార్థి ప్రతిభకు సంబంధించి మార్కులే కొలమానం కాదు. మనదేశంలో సుప్రసిద్ధమైన వ్యక్తుల నుంచి ప్రభుత్వాల వరకు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది తల్లిదండ్రులు మారడం లేదు. పైగా మార్కుల విషయంలో తమ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు. ర్యాంకులు రావాలని వేధిస్తున్నారు. అలా వార్షిక పరీక్షలో సరైన మార్కులు రాకపోవడంతో ఓ విద్యార్థినిని ఆమె తల్లి ప్రశ్నించింది. అది చినికి చినికి గాలి వాన లాగా మారింది. చివరికి ఏం జరిగిందంటే..
దేశ ఐటీ రాజధాని బెంగళూరులో బనశంకరి ప్రాంతంలో పద్మజ(40) అనే మహిళ తన కుటుంబంతో నివసిస్తోంది. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో ఒక కుమార్తె (17) ఇటీవల కర్ణాటక మాధ్యమిక విద్య లో(మన దగ్గర ఇంటర్ స్థాయి) వార్షిక పరీక్షలు రాసింది. ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో సరైన మార్కులు రాకపోవడంతో పద్మజ తన కూతుర్ని ప్రశ్నించింది. “వేలకు వేలు పెట్టి కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నాం. మెరుగైన మార్కులు సాధించి.. అత్యుత్తమ ర్యాంకు సాధిస్తావని భావించాం. నువ్వేమో ఇలా తక్కువ మార్కులు తెచ్చుకున్నావ్. ఇలా అయితే ఎలా? మా ఆశలు మొత్తం ఆడియాసలు చేశావు. దీనివల్ల నలుగురిలో మేము ఎలా తలెత్తుకొని తిరగాలి” అని పద్మజ తన కూతుర్ని నిలదీసింది. దీంతో కోపం తట్టుకోలేక.. ఆ యువతి కత్తి తీసుకొచ్చి పద్మజ కడుపులో మూడుసార్లు పొడిచింది. తీవ్రంగా గాయపడిన ఆమె.. ఆత్మ రక్షణ కోసం తను కూడా ఒక కత్తి కూతురిపై ఎదురుదాడికి దిగింది. ఈ దాడిలో పద్మజ కూతురికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే రక్తపు మడుగులో కొట్టుకుంటూ చనిపోయింది. తీవ్రంగా గాయపడిన పద్మజను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు.
బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మజ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది. తీవ్ర గాయాలు కావడంతో ఆమెకు రక్తస్రావం అధికంగా అయింది. మార్కుల విషయంలో జరిగిన గొడవే ఇంతటి దారుణానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనతో బనశంకరి ప్రాంతంలో కలకలం చెలరేగింది.