Stray Dogs: బాలుడి మర్మాంగం కొరికిన కుక్కలు.. విశ్వనగరంలో మరో డాగ్‌ హర్రర్‌!

కుక్కలు క్రూర మృగాల్లా మారుతున్నాయి. ముఖ్యంగా విశ్వనగరమని మనం గొప్పగా చెప్పుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : August 9, 2024 3:21 pm

Stray Dogs

Follow us on

Stray Dogs: తెలంగాణలో వీధి కుక్కలు క్రూర మృగాల్లా మారుతున్నాయి. మొన్నటి వరకు హైదరాబాద్‌లోనే వీధికుక్కల బెడద ఎక్కువగా ఉండేది. ఇప్పుడు జిల్లాల్లోనూ వీధికుక్కల బెడద పెరిగింది. వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, భద్రాచలం, భూపాలపల్లి జిల్లాల్లో వీధికుక్కలు రెచ్చిపోతున్నాయి. ఒంటరిగా మనిషి కనబడగానే అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న గ్రామ సింహాలు.. ఒక్కసారిగా నిజమైన సింహాల్లా మారిపోతున్నాయి. అటాక్‌ చేసి చంపేయత్నం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదుగురు పిల్లలను వీధి కుక్కలు చంపేశాయి. పదుల సంఖ్యలో పిల్లలపై దాడి చేశాయి. ఇటీవలే సిరిసిల్ల జిల్లాలో ఓ వృద్ధురాలిని దారుణంగా చంపేశాయి. ఆ దృశ్యాలు చూస్తే కుక్కలు చేసినట్లుగా అనిపించదు. అంత క్రూరంగా, కసితీరా చంపేశాయి. ఇక వరంగల్‌ జిల్లాలో వృద్ధ దంపతులపై దాడిచేశాయి. వేసవిలో ఎక్కువగా దాడులు చేసే అవకాశం ఉంటుందని జంతు ప్రేమికులు, పశువైద్యులు తెలిపారు. కానీ ప్రస్తుతం వాతావరణం చల్లబడింది. అయినా కూడా కుక్కల్లో క్రూరత్వం తగ్గడం లేదు. సీజన్‌తో సంబంధం లేకుండా మనుషులే లక్ష్యంగా దాడిచేస్తున్నాయి. పెంపుడు జంతువులు అయిన ఆవులు, గేదెలు, మేకలపైనా దాడిచేస్తున్నాయి. ఓవైపు అధికారులు వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు గ్రామ సింహాలు రెచ్చిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలు, మహిళల ఒంటరిగా కనిపిస్తే వెంటపడి మరీ దాడిచేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 5.75 లక్షల కుక్కలు ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. కుక్కల సంతానం పెరగకుండా స్టెరిలైజేషన్‌ చేపట్టారు. కొన్ని కుక్కలను పట్టుకుని ఊరవతలికి తరలిస్తున్నారు. కానీ అవి తిరిగి జనావాసాల్లోకే వస్తున్నాయి. కుక్కలను చంపొద్దని జంతు సంరక్షకులు చెబుతుంటే.. మరోవైపు అవి మనుషులను చంపేస్తున్నాయి.

తాజాగా బాలుడిపై దాడి..
తాజాగా రాష్ట్ర రాజధానిలో నార్సింగ్‌ మున్సిపాలిటీ పరిధిలోని కొకాపేట సబితానగర్‌ కాలనీలో వీధికుక్కలు శుక్రవారం(ఆగస్టు 9న) పసివాడిపై దాడిచేశాయి. ఈ ఘటనలో బాలుడి పురుషాంగాన్ని విధి కుక్క కొరికేసింది. బాలుడి అరుపులు విన్న స్థానికులు వీధి కుక్కను తరిమేశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

హైకోర్టు మందలించినా..
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కుక్కల దాడుల అంశం కోర్టుకు చేరింది. చిన్న పిల్లలను చంపుతుండడంతో కోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. జీహెచ్‌ఎంసీ అధికారులకు, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కుక్కలు మనుషులను చంపుతుంటే ఏం చేస్తున్నారని మందలించింది. అయినా పాలకుల తీరులో మార్పు రావడం లేదు. జంతు ప్రేమికులు వీధి కుక్కలను షెల్టర్స్‌కు తరలించాలని సూచిస్తున్నారు. నాగపూర్‌లో 90 వేల కుక్కలను షెల్టర్స్‌కు తరలించారని పేర్కొంటున్నారు. మరోవైపు కోర్టు అధికారులు, జంతు సంరక్షణ ప్రతినిధులు కలిసి కుక్కల సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించింది.

కాస్త ఏమరుపాటుగా..
కుక్కలు మనం ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న దాడిచేస్తున్నాయి. వర్షాలు కురుస్తున్నందున కుక్కలు దాడి చేయవని అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది భావిస్తున్నారు.కానీ, అవి తమకు సీజన్‌తో సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు అన్నట్లుగా అటాక్‌ చేస్తున్నాయి. ఒకవైపు కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్‌ఎంసీ అధికారులు కోర్టుకు చెబుతున్నారు. మరోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులు జరిగినప్పుడే అధికారులు హడావుడి చేస్తున్నారు. తర్వాత యథావిధిగా వ్యవహరిస్తున్నారు. దీంతో నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న పిల్లలను బయటకు పంపించడం, ఆరుబయట ఆడుకోనివ్వడం కారణంగా కూడా కుక్కల దాడులు పెరుగుతున్నాయి.