
సెకండ్ వేవ్ లో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో కొంతమంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతుండటం వల్ల వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. కరోనా చికిత్సలో స్టిరాయిడ్లు వాడిన వాళ్లను, మధుమేహంతో బాధ పడేవాళ్లను బ్లాక్ ఫంగస్ సమస్య ఎక్కువగా వేధిస్తుండటం గమనార్హం.
గాలి ద్వారా ముక్కులోకి, గొంతులోకి ప్రవేశించే ఈ ఫంగస్ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎవరితే కరోనా నిర్ధారణ అవుతుందో వాళ్లలో చాలామంది స్టిరాయిడ్లను ఉపయోగించడం వల్ల త్వరగా కోలుకుంటున్నారు. మిథైల్ ప్రెడ్నీసోలోన్, డెక్సామెథసోన్ ఇవ్వడం వల్ల కరోనా రోగులు త్వరగా కోలుకునే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే వీళ్లే బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. డాక్టర్ల సలహాలు, సూచనలు తీసుకోకుండా ఇష్టానుసారం మందులు వాడితే ప్రమాదమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
కరోనా చికిత్స కోసం ఉపయోగించే మందులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో చాలామంది ఈ మందులను సొంతంగా కొనుగోలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కరోనా సోకిన 5 రోజుల తర్వాత ఆయాసం ఉంటే మాత్రమే స్టిరాయిడ్లను తీసుకోవాలి. బ్లాక్ ఫంగస్ బారిన పడిన వాళ్లలో తీవ్రమైన తలనొప్పి వస్తుండటం, ముక్కు, కళ్లు, మెదడు, ప్రభావితం అవుతుండటం గమనార్హం.
బ్లాక్ ఫంగస్ బారిన పడిన వాళ్లలో ఎక్కువగా కంటికి సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయి. కంటి కండరాల కదలికలను నియంత్రించే కావర్నస్ సైనస్ అనే భాగం బ్లాక్ ఫంగస్ వల్ల దెబ్బ తింటోంది. బ్లాక్ ఫంగస్ బారిన పడిన వాళ్లలో రెండు మూడు రోజులకే కంటిచూపు పోతుండటం గమనార్హం. తలనొప్పి, పళ్లు కదలడం, ముక్కులోపల నలుపు, బుగ్గల నొప్పి, అంగిలి బొగ్గులా మారడం లాంటి లక్షణాలు కనిపిస్తే బ్లాక్ ఫంగస్ బారిన పడినట్టేనని గుర్తించాలి.