మన దేశంలో ప్రతిరోజూ 3 లక్షలకు అటూఇటుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తమకు పాజిటివ్ నిర్ధారణ అయిందని కొంతమంది చెబుతున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కేంద్ర వైద్యారోగ్య శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా నుంచి కోలుకున్న వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వెల్లడించాయి.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లు కచ్చితంగా మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సిందే. కరోనా సోకిన వాళ్లకు శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయనే సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు ఉమ్మడిగా వాడే వస్తువులు, ఉపరితలాలను తాకడం వల్ల వైరస్ ను వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు మళ్లీ వైరస్ సోకే అవకాశాలు అయితే ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవాలని భావిస్తే కనీసం మూడు నెలలు వేచి ఉంటే మంచిది. కరోనా నెగటివ్ వచ్చిన తరువాత జ్వరం, ఊపిరి సమస్యలు, ఆక్సిజన్ స్థాయిలు 95 శాతం కన్నా తగ్గిపోవడం, కంటిచూపులో ఇబ్బంది, గందరగోళం, ఛాతీలో నొప్పి లాంటి లక్షణాలు ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
కరోనా సోకిన వారిలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకపోయినా ఇమ్యూనిటీ బలహీనంగా ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులు, అవయవ మార్పిడి చేయించుకుని ఉన్నా బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. గోరు వెచ్చని నీటిని తాగుతూ ఆయుష్ మందులు వాడుతూ యోగా, మెడిటేషన్, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ తగిన స్థాయిలో విశ్రాంతి, నిద్ర ఉంటే కరోనా నుంచి త్వరగా కోలుకునే అవకాశాలు ఉంటాయి.