
దేశంలోని ప్రతి ఒక్కరినీ కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. గతంతో పోలిస్తే కరోనా భయం తగ్గినప్పటికీ వైరస్ బారిన పడితే మాత్రం ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి నెలకొంది. శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో వెలుగులోకి వస్తున్న విషయాల్లో కొన్ని ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. వ్యాక్సిన్ గురించి కీలక ప్రకటనలు వెలువడుతున్నా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం, సమాచారం ఎవరి దగ్గరా లేదు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి మండి కరోనా వైరస్ దేశంలో ఎలా ప్రవేశించిందనే విషయాలను తెలుసుకోవడానికి నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్, బ్రిటన్ దేశాల నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణికుల వల్లే మన దేశంలోకి వైరస్ వ్యాప్తి చెందిందని.. వాళ్లే పరోక్షంగా దేశంలో భారీగా కేసులు నమోదు కావడానికి కారణమయ్యారని ఐఐటీ మండీ చేసిన అధ్యయనంలో తేలింది.
ఐఐటీ మండి వైరస్ తొలుత విజృంభించిన డేటాను విశ్లేషించి ఈ ఫలితాలను వెల్లడించారు. దేశంలోకి జనవరి ఏప్రిల్ మధ్య వచ్చిన వారి డేటా ద్వారా ఆ దేశాల ప్రయాణికుల నుంచి ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందినట్టు వెల్లడైంది. దుబాయ్, బ్రిటన్ నుంచి ప్రైమారీ కాంటాక్ట్ లను సోకిన వైరస్ వారి నుంచి ఇతరులకు సోకిందని తేలింది.
గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, జమ్ముకశ్మీర్, కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందని.. అంతర్జాతీయ ప్రయాణికుల వల్లే దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందిందని అన్నారు. తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్లో సామూహిక వ్యాప్తి జరగలేదని ఐఐటీ మండీ సర్వే నిరాహకులు చెప్పారు.