మన దేశంలో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరిని అడిగినా చైనాలోనే కరోనా వైరస్ పుట్టిందని చెబుతారు. చైనాలోని మార్కెట్ నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందిందని ప్రపంచ దేశాల ప్రజలు భావిస్తారు. అయితే కరోనా వైరస్ గురించి చైనా మాత్రం తాజాగా కొన్ని ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ కు తమ దేశానికి ఏ సంబంధం లేదని 2019 సంవత్సరంలో చాలా ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందిందని తాము ఈ వైరస్ గురించి తెలియజేశామని చైనా చెబుతోంది.
చైనా విదేశాంగ శాఖ కరోనా వైరస్ చైనా వెట్ మార్కెట్లో మొదలైందన్న ఆరోపణ సరికాదని వెల్లడించింది. వుహాన్ నగరంలో వైరస్ పుట్టిందని వ్యక్తమవుతున్న ఆరోపణలు నిరాధారమని తెలిపింది. అమెరికా కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందడానికి చైనానే కారణమని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో చైనా స్పందించి ఈ మేరకు వెల్లడించింది. చైనా తమ దేశంపై ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొత్త వాదనను తెరపైకి తెచ్చింది.
మరోవైపు కరోనా వైరస్ అనేక దేశాల ఆర్థిక స్థితిగతులపై, ఆరోగ్యంపై ప్రభావం చూపిన నేపథ్యంలో చాలా దేశాలు ఆ దేశంతో గతంలో చేసుకున్న ఒప్పందాలను తెగదెంపులు చేసుకుంటున్నాయి. చైనాపై ఇతర దేశాల ప్రజల్లో ఆగ్రహం అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో వేగంగా పరిణామాలు మారిపోతుండటం గమనార్హం. అనేక సర్వేలు చైనాపై ప్రపంచ దేశాలు నమ్మకం కోల్పోతున్నాయని వెల్లడిస్తున్నాయి.
చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్ చైనానే తొలిసారి వైరస్ వ్యాప్తి గురించి ప్రకటన చేసిందని.. వైరస్ యొక్క జన్యుక్రమాన్ని ప్రపంచానికి వెల్లడించిందని చెప్పారు. గబ్బిలాల నుంచి కరోనా వైరస్ పుట్టిందనే వాదన సైతం నిజం కాదని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా గురించి తెలుసుకోవడానికి అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని చైనాకు పంపింది. ఇదే సమయంలో చైనా నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడటం గమనార్హం.