
ప్రపంచ దేశాల్లో శరవేగంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ కొత్త సమస్యలకు కారణమవుతోంది. పెళ్లిపీటలపై ఒక్కటి కావాల్సిన జంటను ఈ మహమ్మారి విడగొట్టడం గమనార్హం. ఏపీలోని అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికూతురుకు కరోనా సోకడం వల్ల ఊహించని ట్విస్టులతో పెళ్లి పెటాకులైంది. పూర్తి వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లాలోని ధర్మవరానికి చెందిన ఓ అబ్బాయికి ముదిగుబ్బకు చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది.
కదిరిలో పెళ్లి జరగాల్సి ఉండగా ముందుగా నిశ్చయించుకున్న ప్రకారం పెళ్లికొడుకు, పెళ్లికూతురు, వాళ్ల బంధువులు వేదిక దగ్గరికి చేరుకున్నారు. సంప్రదాయం ప్రకారం పెళ్లి కార్యక్రమాలకు సిద్ధం చేయగా పెళ్లికూతురు తనకు పెళ్లి ఇష్టం లేదని మొండికేసింది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఈ సమయంలో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఆమె తేల్చి చెప్పింది. పెళ్లికూతురు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది.
పెళ్లికూతురు తల్లి సైతం కూతురును చంపేస్తామని బెదిరించి పెళ్లికొడుకు తరపు వాళ్లు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. కరోనా ఉందని చెబుతున్నా బలవంతంగా తాళి కడతామని చెబుతున్నారని ఇప్పటికే తమవద్ద నుంచి మూడు లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, నగదు తీసుకున్నారని, డబ్బుల ఆశతోనే పెళ్లికొడుకు చెబుతున్నాడు.
అయితే పెళ్లి పెద్ద మాత్రం పెళ్లికూతురు, ఆమె తల్లి ఇష్ట ప్రకారమే అన్నింటికి అంగీకరించి ఇప్పుడు మాట మారుస్తున్నారని చెబుతున్నారు. కరోనా కారణంగా పెళ్లి పెటాకులు కావడం స్థానికంగా సంచలనం కావడం గమనార్హం. కదిరి టౌన్ ఎస్సై మహ్మద్ రఫీ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఈ కేసు గురించి ఫిర్యాదు చేయాలని పెళ్లికొడుకు, పెళ్లికూతురు, వాళ్ల బంధువులకు సూచనలు చేశారు.