తెలంగాణలో వైఎస్ షర్మిల ప్రభావం ఏ మేరకు ఉంటుంది? ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిల పార్టీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షర్మిల పార్టీ పెడితే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై పలు విశ్లేషణలు చేస్తున్నారు. రెండు నెలలుగా పార్టీ ఏర్పాటుపై ప్రకటనలు చేస్తున్నా ఇంతవరకు పేరు ప్రకటించలేదు. ఖమ్మంలో భారీబహిరంగ సభ ప్లాన్ చేసినా కరోనా ఉధృతి నేపథ్యంలో సభ రద్దు కావడంతో మళ్లీ నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు భర్తీ చేయాలని ధర్నా చేసినా అది కూడా సక్సెస్ కాలేదు. దీంతో షర్మిల ప్రభావంపై పెద్ద అంచనాలు లేకుండా పోయాయి.
ఈటల రాజేందర్ వ్యవహారంతో..
ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం బయటకు రావడంతో షర్మిల కథ మొదటికొచ్చింది. దీంతో షర్మిల పార్టీ గురించి అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో షర్మిల తెలంగాణలో తిరగడానికి కూడా ముందుకు రావడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిన సందర్భంలో షర్మిల నేతలతో సంప్రదింపులు సైతం చేయడం లేదు. పార్టీ ఏర్పాటుపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం లేదు. దీంతో షర్మిల పార్టీ ఏర్పాటు ఉంటుందో లేదో అనే సందేహాలు స్పష్టం అవుతున్నాయి.
కేసీఆర్ పైనా విమర్శలు
వైఎస్ షర్మిల తెలంగాణలో పరిపాలన తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ర్టంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని అన్నారు. కొత్త పార్టీల అవసరం గురించిచెప్పారు. రాజకీయంగా రాష్ర్టంలో పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ భవితవ్యంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈటల పార్టీ పెడితే..
మాజీ మంత్రి ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డి పార్టీ పెడితే షర్మిల పార్టీ ప్రభావం కనిపిస్తుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షర్మిల పార్టీ పెడితే రెడ్డి వర్గీయులు ఎక్కువ మొత్తంలో చేరతారని ప్రచారం జరుగుతున్నా క్షేత్ర స్థాయిలో అలా జరగదని చెప్పాలి. లోకల్ లీడర్లుగా ఉన్న ఈటల, కొండా, రేవంత్ పార్టీ పెడితే అత్యధికులు వారి పార్టీలోనే చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ర్టంలో షర్మిలపై సీమాంధ్ర నేత అనే అపవాదు ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా ఆంధ్రులను విమర్శించిన నేతలు ప్రస్తుతం షర్మిల వైపు ఎంత మేరకు మొగ్గు చూపుతారోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.