
‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’లో భాగంగా ఈ రోజు సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాడు. టాపిక్ ఏమిటంటే ‘పర్‌పస్ ఆఫ్ లైఫ్’. అవును దీని గురించి చాలా మంది ఆలోచిస్తారు, మరి పూరి మాటల్లో జీవిత ద్యేయం ఏమిటో విందాం. ‘నేనెందుకు పుట్టాను.. నేనెందుకు ఈ భూమ్మీదున్నాను..ఆ దేవుడు ఏదొక కారణంతోనే నన్ను ఈ భూమి మీదకు పంపించాడు. మరి ఆ కారణం ఏమిటి? ఆ ధ్యేయం ఏమిటి ? అది ఎలా తెలుసుకోవాలి ? అసలు నా జీవితానికి అర్థమేంటి ? పరమార్థమేంటి ? అని ఇలా చాలా మంది తెగ మదనపడుతుంటారు.
నిజానికి జీవితానికి ప్రత్యేకమైన ధ్యేయం అంటూ ఏది ఉండదు, గుర్తుపెట్టుకోండి, నేను కారణజన్ముడ్ని అనుకున్నవాడే ఈ భూమి మీద ఎక్కువ పాపాలు చేస్తాడు. అదే నేనొక ఇసుక రేణువు లాంటి వాడిని అని ఫీల్ అయ్యే వాడు ఏ తప్పు చేయకుండా బతుకుతాడు. అసలు ఇది ఎందుకు ఆలోచించరు ? చెట్టు, ఆ చెట్టు మీదున్న పిట్టకు ప్రత్యేక ధ్యేయం ఏమి ఉంటుంది ? వాటి లాగానే నువ్వు కూడా ఇక్కడ ఉంటున్నావు కదా. అందుకే నువ్వు ఓ ధ్యేయం కోసం పుట్టావని నువ్వు అనుకుంటే గనుక చాలా తప్పులు చేస్తావు.
అందుకే మిగతా జంతువులు వేరు, నేను వేరు అనే భావనను మీలోకి రానివొద్దు. ఈ భూమ్మీద మొత్తం మానవ జాతి అంతరించిపోయినా, ఈ గ్రహానికి నష్టం లేనప్పుడు, ఏ దేవుడు ఏ ధ్యేయం కోసం ఈ భూమి మీదకు ఏ జీవిని పంపడు. కాబట్టి, మన మనుషులందరం పనికి రానివాళ్లమే, మన జీవితాలు అర్థం లేనివి అని గ్రహించండి. ఇదొక్కటే మనం చేయాల్సిన పని, మన గుండె ఆగే లోపు మనం ఎన్నిసార్లు నవ్వ గలిగితే మనం అంత సాధించినట్టు. మనలో పుట్టే హార్మోన్స్ వల్ల నిజానికి మనం అందంగా, ఆనందంగా కనిపిస్తాం, మనం అలా బతక గలిగితే ఈ జీవితానికి అది చాలు.
కాబట్టి మనం ఇంత కంటే ఎక్కువ ఆలోచించకూడదు. ఎవరైనా అసలు ఈ జీవితానికి అర్ధం ఏమిటి ? అంటూ ఆత్మాన్వేషణ వంటి విషయాల పై ఏమైనా రీసెర్చ్ చేస్తుంటే, వాటిని అర్జెంట్‌గా ఆపేస్తే అది మీకే మంచిది. అయినా మనకొక ధ్యేయం ఉందనుకుంటే, మనం ఒక బానిస కిందే లెక్క కదా. ఎందుకంటే లక్ష్యం ఉంటే, దాని కోసం చావాలి. అదే ఏ ధ్యేయం లేకపోతే.. స్వేచ్ఛగా ఉండొచ్చు. స్వేచ్ఛ చాలా విలువైనది. దాన్నుండే హ్యాపినెస్ వస్తుంది. సింపుల్ గా చెప్పుకుంటే మన జీవిత ధ్యేయం మన చిరునవ్వే’ అంటూ పూరి చెప్పుకొచ్చాడు.