
‘పావలా శ్యామల’.. దాదాపు ఆమెది నలభై సంవత్సరాల సినిమా జర్నీ. మహామహులతో కలిసి నటించిన అనుభవం ఆమెది, రంగస్థల నటిగా, హాస్యనటిగా, సహాయనటిగా ఆమె చేయని పాత్ర లేదు. తెలుగులో ఎన్నో చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన అంత గొప్ప నటికి, తినడానికి కూడా తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు అని మనం వినాల్సి రావడం నిజంగా బాధాకరమైన విషయం. ఓ వీడియోలో ఆమె చెప్పిన మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
‘ఐదు రోజులు పస్తులున్నా.. ఆకలితో చనిపోతామనుకున్నా.. దయ చేసి మమ్మల్ని ఆదుకోండి’ అని ఆమె ఏడుస్తూ చెబుతుంటే.. రాయి లాంటి మనసు కూడా కరిగిపోతుంది. కానీ, ఆమెకు ఆశించిన స్థాయిలో మాత్రం సాయం ఇంకా అందకపోవడం దురదృష్టకరం. ప్రజలకు ఆమె గోడు చేరువు కాలేదో, లేక ఆమె బాధను ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరో తెలియదు గానీ,
ఆమెను ఆదుకోవడానికి మాత్రం జనం పెద్దగా ముందుకు రాలేదు. కానీ పావలా శ్యామల ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో కుమిలిపోతున్నారు. పైగా అనారోగ్య పరిస్థితులతో నటనకు కూడా దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె ఎస్.ఆర్.నగర్ బీకేగూడలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ.. అద్దెను కూడా చెల్లించలేని దుస్థితితో అల్లాడిపోతున్నారు. దురదృష్టవశాత్తు ఆమె కూతురు కూడా మంచనా పడ్డారు.
ఓ కాలికి ఫ్యాక్చర్ కావడంతో 18 నెలలుగా ఆమె కుమార్తె మంచానికే పరిమితమవ్వడం, ఈ వయసులో కూడా శ్యామలగారు కూతురికి అన్ని పనులు చేసి పెట్టడంతో ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది. కాబట్టి, అనారోగ్యంతో ఓపిక లేకుండా ఉన్న శ్యామలగారిని దాతులు ఎవరైనా ఆదుకుంటే, ఒక మహానటికి అన్నం పెట్టినవారు అవుతారు. దాతలు ముందుకు రండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులతో నలిగిపోతున్న ఆ హాస్యనటికి సాయం చేయండి.