
రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలు ఒక రోజు ముందుగానే శుక్రవారం హైదరాబాద్ లో మొదలయ్యాయి. శిల్పకాళ వేదికలో అభిమానులు గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ కు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీచ్ తో కేకపెట్టించిన సాయి.. ఫ్యాన్స్ లో జోష్ నింపారు.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ గురించి చెబుతూ ఫ్యాన్స్ తో ఈలవేసి గోలపెట్టించారు. బర్త్ డే బాయ్ రామ్ చరణ్ ను కూడా ఆకాశానికెత్తేశాడు. అప్పట్లో మెగాస్టార్ బర్త్ డే వేడుకలను చూసి.. ఈ స్థాయిలో ఏ హీరోకైనా జరుగుతాయా? అనుకునేవాడనని చెప్పారు.
అయితే.. ఇంతకాలం తర్వాత మా బావ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు ఆ స్థాయిలో జరుగుతున్నాయని అన్నారు. మామయ్య చిరంజీవి, పవన్ కల్యాణ్ తర్వాత అంత ప్రేమను చెర్రీకి ఇస్తున్నారని చెప్పారు. ఇదంతా అభిమానుల ప్రేమవల్లే సాధ్యమైందని అన్నారు సాయి తేజు. ఇంతటి ప్రేమ కురిపిస్తున్న అభిమానులకు థాంక్స్ చెప్పారు.
ఇదే వేదికమీద సంచలన వ్యాఖ్యలు చేశారు సాయి తేజు. కొందరు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారని అన్నారు. కావాలనే తమ ఫ్యామిలీపై నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారని చెప్పారు. వాళ్లు ఎవరనేది మీకు తెలుసు అంటూ ఫ్యాన్స్ ను ఉద్దేశించి అన్నారు.
అయితే.. వాళ్లు తమను ఎంత ద్వేషించినా.. తాము మాత్రం అందరినీ ప్రేమిస్తూనే ఉంటామని ప్రకటించారు సాయిధరమ్ తేజ్. మెగాస్టార్ మహావృక్షం అని చెప్పిన తేజు.. ఆ చెట్టుకింద ఎదుగుతున్న పిల్లలం తామంతా అని అన్నారు. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుతామని చెప్పారు.