పాత్ర ఎంత గొప్పది అయితే, కథ అంత గొప్పది అవుతుంది. గొప్ప పాత్రలను ఎంచుకోవడంలోనే ఆయా నటుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీకు తెలుసా ? భారతీయ సినీ లోకంలోనే పాత్రలను ఎంచుకోవడంలో గొప్ప ఆలోచన ఉన్న గొప్ప హీరో… సీనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ సినీ కెరీర్ లో మరపురాని పాత్రలు అనేకం. కేవలం ఒకటే చెప్పడం అంటే కచ్చితంగా కష్టమే. అందుకే, స్వర్గీయ నందమూరి తారకరామారావు అనగానే ఎన్నో గొప్ప పాత్రలు కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి.
ఆయన చేసిన ఎన్నో గొప్ప పాత్రలలో గుండమ్మ కథ సినిమాలో అంజి పాత్ర ఒక్కటి. ఎన్టీఆర్ నటించిన సినిమాలలో చాలా ఉల్లాసం, ఉత్సాహంతో కూడుకున్న పాత్ర అంజి పాత్ర. పైగా గుండమ్మ కథ చిత్రంలోని అంజి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. అన్నిటికి మించి హాస్య ఛలోక్తులతో సినిమాని మొత్తం నడిపించే పాత్ర అంజిది. అల్లుడిగా అత్తకు పంచ్‌ల మీద పంచ్‌లు వేసే పాత్ర కూడా. కథానాయకులలోని హాస్య కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన మొదటి పాత్ర కూడా అంజి పాత్రే.
అలాగే ఒక పాత్ర ద్వారా కథలోని కొత్త కోణాలను ఎలా పరిచయం చేయవచ్చో.. అంజి పాత్రను చూస్తే తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమాలలో మాస్ హీరోల పాత్రలకు నాంది పలికిన పాత్రగా కూడా ఈ అంజి పాత్రను సగర్వంగా చెప్పుకోవచ్చు. కానీ మీకు తెలుసా ? ఈ పాత్రను తమిళంలో ఎంజీఆర్ నటించమంటే నటించలేదు అట. హీరో అయి ఉండి పనోడిలా.. పెద్ద లాగు వేసుకుని అందరి చేత తిట్లు తినడం హీరోయిజమ్ ఎలా అవుతుంది ? అంటూ అప్పటి స్టార్ హీరోలు అంజి పాత్రను చేయడానికి నిరాకరించారు.
కానీ కథ విన్న ఎన్టీఆర్ కి అంజి పాత్ర బాగా నచ్చింది. గుండమ్మ కథ దర్శక నిర్మాతలు ముందే ఫిక్స్ అయిపోయారు. ఎన్టీఆర్ అంజి పాత్రను అసలు అంగీకరించరు అని. కానీ.. ఎన్టీఆర్ అనూహ్యంగా కథ విన్న తర్వాత అంజి పాత్రలో నటించడానికి అంగీకరించారు. పైగా దగ్గర ఉండి మరీ అంజి పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అందుకే ఆ పాత్ర ఇప్పటికీ గ్రేట్ పాత్రల్లో మేటి పాత్రగా నిలిచిపోయింది.