
‘అరవింద సమేత’ లాంటి సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దానికి కథను కూడా సిద్ధం చేశాడని, పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోందని టాక్ వచ్చింది. ఎన్టీఆర్ RRR పూర్తిచేసుకొని రావడమే ఆలస్యం అని అనుకున్నారు.
నిజానికి అలవైకుంఠ పురములో సినిమా తర్వాత నుంచి త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకోసమే వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ RRR షూటింగ్ డ్రాగ్ అవుతూ రావడం.. మధ్యలో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోకు డేట్లు కేటాయించడం వంటి కారణాలతో.. త్రివిక్రమ్ సినిమా వాయిదా పడుతూ వచ్చిందనే ప్రచారం సాగింది. అయితే.. అసలు కారణం వేరే ఉందని తెలిసింది.
ఎలాంటి సినిమా చేయాలనే విషయంలో వీరిద్దరూ తర్జనభర్జన పడడం.. చివరకు పొంతన కుదరకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని అంటున్నారు. మంత్రిగారి వియ్యంకుడు లాంటి సినిమా చేద్దామని త్రివిక్రమ్ సూచించగా.. జూనియర్ వద్దన్నాడట. దీంతో.. భారీ యాక్షన్ లైనప్ చెప్పాడట త్రివిక్రమ్. అదికూడా వద్దన్న ఎన్టీఆర్.. ఫ్యామిలీ మూవీ కావాలని అడిగాడట.
RRR తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి, పక్కా స్క్రిప్టుతో వస్తేనే సినిమా చేస్తానని చెప్పాడట జూనియర్. దీనికి తనపై ఆ మాత్రం నమ్మకం లేదా అని కూడా అన్నాడట త్రివిక్రమ్. దీంతో.. డిస్కషన్స్ ముడిపినట్టైందని సమాచారం. ఈ నేపథ్యంలో.. మీరు వేరేవాళ్లతో ఒక సినిమా చేయడం.. నేను ఒక సినిమా చేస్తాను.. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు చూద్దామని చెప్పాడట ఎన్టీఆర్.
ఆ విధంగా ఈ సినిమా ఆగిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరో క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా వేచిఉన్నారు. ఎన్టీఆర్ తో సినిమా ఆగిపోయిన నేపథ్యంలో.. మహేష్ తో మూవీ అనౌన్స్ అవుతుందని, అది కూడా ఉగాదికే ప్రకటిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. మరి, ఈ రెండు విషయాల్లో నిజం ఎంత అనేది తేలాల్సి ఉంది.