https://oktelugu.com/

Gautam Adani: అదానీ అవినీతి కేసులో వైసిపి ఫస్ట్ రియాక్షన్

అంతర్జాతీయ స్థాయిలో ఆదానీ అవినీతి కేసు పెను దుమారానికి కారణమవుతోంది. ప్రధానంగా ఇప్పుడు జగన్ చుట్టూ బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.దీనిని తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తోంది వైసిపి.

Written By:
  • Dharma
  • , Updated On : November 22, 2024 / 11:27 AM IST

    Gautam Adani(1)

    Follow us on

    Gautam Adani: అమెరికాలో ఆదానీ కి సంబంధించి అవినీతి కేసులో ఆసక్తికర పరిణామాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఏపీలో సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం జగన్ సర్కార్ కు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 1750 కోట్ల రూపాయల మేర లంచాలు ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ కోర్టులో అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పెద్ద ఎత్తున దుమారం నడుస్తోంది. జాతీయస్థాయిలో సైతం ఇది చర్చకు దారితీస్తోంది. ఈ తరుణంలో దీనిపై వైసీపీ స్పందించింది. అప్పట్లో ఏం జరిగిందో వివరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో సోలార్ ఒప్పందాలపై అసలు ఏం జరిగింది? లంచాలు స్వీకరించడానికి అవకాశం ఉందా? లేదా? అనే విషయాలను సమగ్రంగా వివరించింది. ఏపీ విద్యుత్ సంస్థలు వ్యవసాయ రంగానికి సంవత్సరానికి 12,500 మెగావాట్ల ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తున్నాయి. అంత మేరకు మాత్రమే సదరు సంస్థలకు ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది అని చెబుతోంది వైసిపి. రాష్ట్రంలో గత ప్రభుత్వాల విధానాల కారణంగా అధిక టారీఫ్ లతో విద్యుత్ ఒప్పందాలు అమలు చేశారని.. రాష్ట్ర డిస్కములపై ఇవి ప్రభావం చూపకుండా.. పంపిణీ విజయంలో భాగంగా విద్యుత్ కొనుగోలు ఖర్చు దాదాపు కిలోవాటుకు ఐదు రూపాయల 10 పైసల చొప్పున చెల్లించడం ప్రభుత్వానికి భారంగా మారిందని వెల్లడించింది. ఈ సమస్య తగ్గించే ఉద్దేశంతో 2020లో అప్పటి వైసీపీ ప్రభుత్వం సోలార్ పార్కులను ఏర్పాటు చేసుకునేందుకు నిర్ణయించిందని వెల్లడించింది. దీనికి సంబంధించి ఏపీ జీఈసిల్ ద్వారా నవంబర్ 2021 లో 2400 మెగావాట్ల సోలార్ అభివృద్ధి కోసం టెండర్లను పిలిచిందని ప్రకటనలో పేర్కొన్నారు.

    * పోటీపడిన చాలా కంపెనీలు
    టెండర్ ప్రక్రియకు సంబంధించి చాలా రకాల కంపెనీలు వచ్చాయని వైసిపి పేర్కొంది. మొత్తం 24 బిడ్ లు కిలో వాట్ కు రెండు రూపాయల 49 పైసల నుంచి రెండు రూపాయల 58 పైసల వరకు చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు చెప్పింది. టెండర్ కు చట్టపరమైన, నియంత్రణ పరంగా ఎదురైన అడ్డంకులతో ఈ ప్రయత్నాలు ఏవి ఫలించలేదని తెలిపింది. అటు తరువాత కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్ను కిలోవాటుకు రెండు రూపాయల 49 పైసల చొప్పున.. 25 ఏళ్ల కాలానికి కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు వైసిపి స్పష్టం చేసింది. దీనికి ఏపీ ఈ ఆర్ సి కూడా ఆమోదించినట్లు వెల్లడించింది. కేంద్ర ఈ ఆర్ సి ఆమోదంతోనే 2021 డిసెంబర్ ఒకటిన ఒప్పందం జరిగినట్లు చెప్పుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అదా నీ గ్రూప్ తో ఎటువంటి ఒప్పందం చేసుకోలేదన్న విషయాన్ని ప్రస్తావించింది.

    * రాష్ట్ర ప్రయోజనాల కోసమే
    అప్పట్లో రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసిపి చెప్తోంది. ఇంత తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల రాష్ట్రానికి సంవత్సరానికి 3700 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని చెబుతోంది. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి మొత్తం ప్రయోజనం అపారంగా ఉంటుందని వైసిపి తాజాగా వెల్లడించింది.