Xiaomi 18 Pro Features: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన తదుపరి ఫ్లాగ్‌షిప్ సిరీస్ Xiaomi 18 గురించి అప్డేట్ ఇచ్చిన తరువాత దీని గురించి ఆసక్తి చర్చ సాగుతోంది. సాధారణంగా అన్ని కంపెనీలు మొదట స్టాండర్డ్ వేరియంట్‌ను లేదా అన్ని మోడళ్లను ఒకేసారి విడుదల చేస్తాయి. కానీ ఈసారి షావోమి తన స్టాండర్డ్ మోడల్ కంటే ముందే ప్రీమియం వేరియంట్ అయిన Xiaomi 18 Proని మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ ‘డిజిటల్ చాట్ స్టేషన్’ వెల్లడించారు. ఈ కొత్త ఫోన్ ఎలా ఉండబోతుందంటే?
షావోమి 18 ప్రో స్మార్ట్‌ఫోన్ మొదటగా సెప్టెంబర్ లేదా నవంబర్ నాటికి చైనాలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాతే స్టాండర్డ్ షావోమి 18 మోడల్ మార్కెట్లోకి వస్తుందని తెలుస్తోంది. అయితే ఈ రెండు మోడళ్ల లాంచ్ మధ్య ఎక్కువ గ్యాప్ ఉండదని వచ్చే చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ (ఫిబ్రవరి) కంటే ముందే ఈ రెండు ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని టిప్‌స్టర్ పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత మార్కెట్లోకి కూడా ఈ సిరీస్ త్వరగానే అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
షావోమి 18 ప్రో మోడల్‌లో ఈసారి డిజైన్ పరంగా భారీ మార్పులు చేయబోతున్నారు. ఫోన్ వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైన రియర్ డిస్‌ప్లే ఇవ్వబోతున్నట్లు సమాచారం. దీని ద్వారా ఫోన్ లాక్ తీయకుండానే నోటిఫికేషన్లు చూడటం, మ్యూజిక్ కంట్రోల్ చేయడం లేదా మెయిన్ కెమెరాతో హై-క్వాలిటీ సెల్ఫీలు తీసుకోవడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా, ఐఫోన్ తరహాలోనే బాడీ ఫ్రేమ్‌పై ఒక ప్రత్యేకమైన AI Button కూడా రాబోతోంది. దీనిని సింగిల్ ప్రెస్ చేయడం ద్వారా వాయిస్ అసిస్టెంట్ ఆన్ చేయడం, ఆర్టికల్స్ సమరైజ్ చేయడం, రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ వంటి పనులను క్షణాల్లో చేసుకోవచ్చు.
షావోమి 18 ప్రో కెమెరా విభాగం విషయానికొస్తే.. దీని వెనుక భాగంలో ఏకంగా రెండు 200 మెగాపిక్సెల్ కెమెరాను, వీటికి తోడుగా ఒక 50 మెగాపిక్సెల్ అమర్చబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండటం వల్ల, ఎలాంటి క్వాలిటీ తగ్గకుండా లాస్‌లెస్ డిజిటల్ జూమ్ ఫీచర్‌ను యూజర్లు అందుకోవచ్చు. నైట్ సమయంలో ఫోటోగ్రఫీ, పోర్ట్రెయిట్ షాట్స్ కోసం ఇది సరికొత్త ఏఐ అల్గారిథమ్స్‌తో పనిచేస్తుంది.
షావోమి 18 ప్రో మోడల్ లో దాదాపు 6.3 అంగుళాల కాంపాక్ట్ సైజ్ AMOLED ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేయనుంది. డాల్బీ విజన్, డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉండడంతో బెజెల్స్ చాలా సన్నగా ఉండనున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో సిలికాన్-కార్బన్ టెక్నాలజీతో కూడిన 7,000mAh భారీ బ్యాట్రీని ప్యాక్ చేయనున్నారు. ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుందని సమాచారం.
ఈ ఫోన్ అత్యంత వేగవంతమైనదిగా పనిచేయనుంది. ఇందులో Snapdragon 8 Elite Gen 6 Pro చిప్‌సెట్‌తో ఈ మొబైల్ రన్ కానుంది. భారీ గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను చాలా సులభంగా హ్యాండిల్ చేయగలిగే ఆండ్రాయిడ్ ఆధారిత హైపర్‌ఓఎస్ (HyperOS) సాఫ్ట్‌వేర్‌ను అందించనున్నారు.
