Bengaluru UPI Payments: డిజిటల్ పేమెంట్స్‌కు మారుపేరుగా మారిన భారతదేశపు ఐటీ హబ్ బెంగళూరులో ఇప్పుడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నగరం డిజిటల్ పేమెంట్స్ నిరాకరిస్తూ మళ్లీ నగదు చెల్లింపుల వైపు మళ్లుతోంది. ఇది వినడానికి వింతగా ఉన్నా, దీనికి కారణం ట్యాక్స్ అధికారుల ఒత్తిడేనని వ్యాపారులు చెబుతున్నారు. నగరంలోని అనేక చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారులు తమ దుకాణాల వద్ద నో యూపీఐ, ఓన్లీ క్యాష్ అనే స్టిక్కర్లను లేదా బోర్డులు పెడుతున్నారు. ఉన్నట్లుండి ఇలాంటి మార్పునకు ప్రధాన కారణం.. బెంగళూరులోని వేలాది మంది వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు అందడమే. కొందరు వ్యాపారులు, న్యాయవాదులు, అకౌంటెంట్ల ప్రకారం.. కొన్ని కేసులలో లక్షల్లో పన్నుచెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు తేలింది. ఈ అకస్మాత్తుగా అందిన నోటీసులు వ్యాపారులలో పెద్ద ఎత్తున భయాన్ని సృష్టించాయి. చాలామంది ఇప్పుడు అధికారులు తమను తొలగిస్తారని ఆందోళన చెందుతున్నారు. పన్ను అధికారుల దృష్టిలో పడకుండా ఉండేందుకు వారు తమ ట్రాన్సాక్షన్లను డిజిటల్‌గా ట్రాక్ చేయకుండా ఉండేందుకు, ఇప్పుడు నగదు చెల్లింపులకు మళ్లుతున్నారు.
Also Read: బాలయ్య-అనసూయ ‘స్క్విడ్ గేమ్’ ఆడితే..!
జీఎస్టీ చట్టం ప్రకారం వస్తువులను విక్రయించే వ్యాపారాలు తమ వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు దాటితే జీఎస్‌టీకి నమోదు చేసుకోవాలి. పన్ను చెల్లించాలి. సర్వీస్ ప్రొవైడర్లకు ఈ పరిమితి రూ.20 లక్షలు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు స్పందిస్తూ, 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి తమ యూపీఐ లావాదేవీల డేటా ఈ పరిమితులను మించి టర్నోవర్‌ను సూచించిన వ్యాపారులకు మాత్రమే నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు. అటువంటి వ్యాపారాలు చట్టబద్ధంగా నమోదు చేసుకోవాలి.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను కట్టాలని అందులో పేర్కొన్నారు. దీని వల్ల డిజిటల్ పేమెంట్స్ డేటా పారదర్శతను పెంచుతుందని, పన్ను ఎగవేతను అరికట్టవచ్చని ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది.
అయితే, ఈ విధానంపై నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేవలం డిజిటల్ ట్రాన్సాక్షన్ల ఆధారంగా టర్నోవర్‌ను అంచనా వేయడం పన్ను అధికారులకు సాధ్యం కాదని హెచ్చరించారు. ఇది పన్ను అధికారుల అధిక అధికార దుర్వినియోగానికి దారితీస్తుందని, చిన్న వ్యాపారులపై ఒత్తిడిని పెంచుతుందని సూచించారు. వాస్తవానికి యూపీఐ ట్రాన్సాక్షన్లు అన్నీ వ్యాపారం ద్వారా జరిగినవే కాకపోవచ్చు. కొన్ని అనధికారిక రుణాలు లేదా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కు ట్రాన్సఫర్ చేసిన ట్రాన్సాక్షన్లు కూడా కావొచ్చు. ఇది వ్యాపారుల భయాలకు మరింత బలం చేకూర్చుతోంది. చిన్న వ్యాపారుల పర్సనల్ యూపీఐ అకౌంట్లకు వచ్చే డబ్బును వ్యాపార ఆదాయంగా పరిగణించడం సరైనది కాదనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం యూపీఐకు బాగా అలవాటుపడిపోయిన జనం మళ్ల నగదు చెల్లింపులు వైపు మళ్లాలంటే కాస్త కష్టమనే చెప్పాలి.