Elon Musk: ఎలాన్‌ మస్క్‌ భారత పర్యటన వాయిదాకు అసలు కారణమేంటి?

భారత్‌లోకి టెస్లా రాకపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో విద్యుత్‌ కార్ల వినియోగం అవసరమని గతంలోనే మస్క్‌ అభిప్రాయపడ్డారు.

Written By: Raj Shekar, Updated On : April 20, 2024 2:49 pm

Elon Musk

Follow us on

Elon Musk: విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ భారత పర్యటన వాయిదా పడింది. సంస్థకు చెందిన అతి ముఖ్యమైన పనుల కారణంగా తన పర్యటన ఆలస్యమవుతోందని ‘ఎక్స్‌’ వేదికగా మస్క్‌ వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటించేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈమేరు ఓ వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఆయన ఏప్రిల్‌ 21, 22 తేదీల్లో భారత్‌లో పర్యటించాలి. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ–మస్క్‌ కీలక భేటీ కూడా ఉంది. అనంతరం వారు పెట్టుబడుల గురించి ప్రకటన చేస్తారని అంతా భావించారు. మోదీతో భేటీ గురించి మస్క్‌ కొద్ది రోజుల క్రితం సోషల్‌ మీడియాలో పోస్టు కూడా చేశారు. దీనిపై మోదీ కూడా స్పందించారు. భారత్‌కు పెట్టుబడులు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తయారీ రంగంలో మన దేశ ప్రజల స్వేదం ఉండాల్సిందే అని తెలిపారు. అప్పుడు మన దేశ యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి అని పేర్కొన్నారు.

మోదీ అభిమానిగా పేర్కొన్న మస్క్‌..
ఇక మస్క్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులో తాను మోదీ అభిమానినని తెలిపారు. దీనిపై మోదీ స్పందించారు. వాస్తవానికి మస్క్‌ భారత్‌కు మద్దతుదారు. 2015లో టెస్లా ఫ్యాక్టరీని సందర్శించినప్పుడు ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకుని మరీ నాతో సమావేశమయ్యారు అని మోదీ తెలిపారు. తన ఫ్యాక్టరీ మొత్తాన్ని చూపించారని తెలిపారు. ఆయన దృక్పథం ఏంటో అప్పుడే తనకు అర్థమైందని ప్రధాని వెల్లడించారు.

భారత్‌లోకి టెస్లా రాకపై..
ఇక భారత్‌లోకి టెస్లా రాకపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో విద్యుత్‌ కార్ల వినియోగం అవసరమని గతంలోనే మస్క్‌ అభిప్రాయపడ్డారు. తయారీ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలం కోసం టెస్లా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా సంప్రదించినట్లు సమాచారం. మహారాష్ట్ర, గుజరాత్‌ ఆకర్షనీయమైన ప్రతిపాదన ముందుంచినట్లు, తెలంగాణ ప్రభుత్వంతోనూ చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2 నుంచి 3 బిలియన్‌ డాలర్ల వరకు మస్క్‌ పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని సమాచారం.