UPI Activation: డెబిట్ కార్డు లేకపోయినప్పటికీ యూపీఐ ఆక్టివేషన్ చేయవచ్చు.. ఎలాగంటే?

ఆన్ లైన్ లో లావాదేవీలు చేసేవారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో యూపీఐ ఆక్టివేషన్ నిబంధనలు సులభతరం అయిపోయాయి. అందుకే డెబిట్ కార్డుతో సంబంధం లేకుండా కేవలం ఆధార్ నెంబర్ తో యూపీఐ ఆక్టివేట్ చేసుకునే సౌలభ్యం చెంతకే వచ్చింది.

Written By: Suresh, Updated On : February 28, 2024 6:36 pm

UPI Activation

Follow us on

UPI Activation: ఒకప్పుడు డబ్బులు కావాలంటే ఖాతా పుస్తకం తీసుకొని బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. ఎవరితోనైనా లావాదేవీలు జరపాలంటే దానికి చాట భారతమంతా ప్రక్రియ ఉండేది. కొంతకాలానికి డెబిట్ కార్డు రావడం వల్ల కొంత శ్రమ తప్పిపోయింది. కానీ కోవిడ్ సమయంలో ఎప్పుడైతే డిజిటల్ లావాదేవీలు తెరపైకి వచ్చాయో.. అప్పుడే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఢిల్లీ నుంచి మొదలు పెడితే గల్లీ దాకా డిజిటల్ లావాదేవీలే జరుగుతున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే, భీమ్ వంటి వాటి ద్వారా రోజుకు వందల కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా యూపీఐ ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే సాధారణంగా పేమెంట్స్ కి సంబంధించి యాప్స్ వాడాలంటే కచ్చితంగా యూపీఐ ఆక్టివేట్ గా ఉండాలి. అలాంటి యూపీఐ ఆక్టివేట్ కావాలంటే డెబిట్ కార్డ్ ఉండాల్సిందే. అనుకోని పరిస్థితుల్లో డెబిట్ కార్డు పోతే ఇక అంతే సంగతులు. అయితే నిన్నా మొన్నటి వరకు ఇలాంటి ఇబ్బందిని అందరూ ఎదుర్కొన్నారు. ఇకనుంచి అటువంటి పరిస్థితి లేదు.

ఆన్ లైన్ లో లావాదేవీలు చేసేవారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో యూపీఐ ఆక్టివేషన్ నిబంధనలు సులభతరం అయిపోయాయి. అందుకే డెబిట్ కార్డుతో సంబంధం లేకుండా కేవలం ఆధార్ నెంబర్ తో యూపీఐ ఆక్టివేట్ చేసుకునే సౌలభ్యం చెంతకే వచ్చింది. డెబిట్ కార్డుతో యూపీఐ ఆక్టివేట్ చేసుకోవడం వల్ల ఖాతాదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చాలామందికి పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నప్పటికీ డెబిట్ కార్డులు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటి ఖాతాదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని జాతీయ, రాష్ట్రీయ బ్యాంకులు సులభతర నిర్ణయం తీసుకున్నాయి. దానివల్ల కేవలం ఆధార్ కార్డు తోనే యూపీఐ ఆక్టివేట్ చేసుకునే సౌలభ్యం ఖాతాదారులకు కలిగింది. అది ఎలాగంటే..

ఉదాహరణకు మీరు ఫోన్ పే వాడుతుంటే.. అందులో ప్రొఫైల్ దగ్గర ముందుగా క్లిక్ చేయాలి. ఆ తర్వాత యాడ్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. అందులో మీరు ఉపయోగిస్తున్న బ్యాంక్ పేరు టైప్ చేసి దాని ఐకానిక్ సింబల్ రాగానే ఓకే చేయాలి. అనంతరం అందులో ఖాతా నెంబర్ ఎంటర్ చేయాలి. మీ ఖాతా నెంబర్ సరిపోలిన తర్వాత బ్యాంకు నుంచి ఓకే అని మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీరు వాడుతున్న ఆధార్ నెంబర్ ను అందులో ఎంటర్ చేస్తే.. ఆధార్ నెంబర్ కు అనుసంధానమైన ఫోన్ నెంబర్ కు ఓటిపి నెంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ అందులో ఎంటర్ చేస్తే చాలు యూపీఐ ఆక్టివేట్ అవుతుంది. ఇలా యూపీఐ ఆక్టివేట్ అవ్వడం వల్ల లావాదేవీలు సులభతరంగా చేసుకోవచ్చు. గతంలో యూపీఐ ఆక్టివేట్ కావాలంటే డెబిట్ కార్డ్ కచ్చితంగా ఉండాల్సి వచ్చేది. అయితే ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను మరింత పెంచాలని ఆదేశించిన నేపథ్యంలో యూపీఐ ఈ నిర్ణయం తీసుకుంది. యూపీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల డిజిటల్ లావాదేవీలు పెరిగాయని తెలుస్తోంది.