Best hatchback cars in India: భారత ఆటోమొబైల్ మార్కెట్లో 2026 మే నెల కార్ల అమ్మకాల గణాంకాలు విడుదల కాగా, ప్రయాణికుల కార్ల విభాగంలో మారుతి సుజుకి మోడళ్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోని పలు మోడళ్లు భారీ వృద్ధిని నమోదు చేస్తూ వినియోగదారుల ఆదరణను పొందాయి. గత ఏడాదితో పోలిస్తే అనేక మోడళ్ల అమ్మకాలు గణనీయంగా పెరగడం విశేషం. ఇంతకీ ఆ కార్లు ఏవంటే?
అమ్మకాల జాబితాలో మొదటి స్థానాన్ని మారుతి సుజుకి బాలెనో కైవసం చేసుకుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా మంచి గుర్తింపు పొందిన ఈ కారు 2026 మే నెలలో 18,398 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో 11,618 యూనిట్లు మాత్రమే విక్రయించబడగా, ఈసారి భారీ వృద్ధిని సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ కారు ధర రూ.5.99 లక్షల నుంచి రూ.9.10 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
రెండో స్థానంలో మారుతి వ్యాగన్ఆర్ నిలిచింది. కుటుంబాలకు అనువైన ఈ కారు మే నెలలో 18,076 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2025 మేలో 13,949 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు ఈ ఏడాది గణనీయంగా పెరగడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని మరోసారి నిరూపించింది. దీనిని రూ. 5.00 లక్షల నుంచి రూ. 6.85 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
మూడో స్థానంలో మారుతి స్విఫ్ట్ నిలిచింది. యువతను ఆకట్టుకునే డిజైన్, మెరుగైన మైలేజీ కారణంగా స్విఫ్ట్‌కు మంచి డిమాండ్ కొనసాగుతోంది. 2026 మేలో ఈ కారు 17,519 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగా, గత ఏడాది ఇదే సమయంలో 14,135 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. ఈ కారును రూ. 5.79 లక్షల నుంచి రూ. 8.50 లక్షల వరకు విక్రయిస్తున్నారు.
నాలుగో స్థానంలో ఆల్టో నిలిచింది. తక్కువ ధరలో అందుబాటులో ఉండే ఈ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ 2026 మేలో 9,887 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది మేలో కేవలం 4,970 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి దాదాపు రెట్టింపు స్థాయిలో విక్రయాలు జరగడం విశేషంగా చెప్పుకోవచ్చు.
ఐదో స్థానంలో ఎస్-ప్రెస్సో నిలిచింది. కాంపాక్ట్ ఎస్యూవీ తరహా డిజైన్‌తో ఆకట్టుకునే ఈ మోడల్ గత ఏడాది మేలో 1,806 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసింది. అయితే 2026 మే నాటికి అమ్మకాలు భారీగా పెరిగి 6,388 యూనిట్లకు చేరుకోవడం మార్కెట్లో ఈ కారు ఆదరణ పెరుగుతున్న సంకేతంగా భావిస్తున్నారు.
మొత్తంగా చూస్తే, 2026 మే నెలలో అత్యధికంగా అమ్ముడైన తొలి ఐదు కార్ల జాబితాలో మారుతి సుజుకి మోడళ్లే చోటు దక్కించుకోవడం విశేషం. పెరుగుతున్న డిమాండ్, మెరుగైన ఫీచర్లు, మంచి మైలేజీ మరియు అందుబాటు ధరలు ఈ కార్ల విజయానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
