Toll Plaza: వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాదధికార సంస్థ (NHAI) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత ఏప్రిల్ 1 నుంచి టోల్ ట్యాక్స్ పెరుగుతాయని తెలిపిన విషయం తెలిసిందే. అయితే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా పెంపుదలను నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వినతి మేరకు భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్ హెచ్ ఏఐ తెలిపింది. దీంతో జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులకు పాత చార్జీలే వసూలు చేయనున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి జూన్ 1క ఏడు విడుతల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4 న పోలింగ్ ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటి వరకు పాత టోల్ ఛార్జీలే కొనసాగుతాయి. అయితే ఎన్నికల తరువాత మళ్లీ పెంపు ఉంటుందా? లేదాన అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ ఉన్నందునే ఛార్జీలు పెంచడం లేదని, ఒకవేళ ఒక రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయితే ఆ రాష్ట్రంలో చార్జీలు పెరుగుతాయని కొందరు అంటున్నారు.
టోల్ ఛార్జీలు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటాయి. ఉదాహరణకు నేషనల్ హైవే 65 పై జీఎంఆర్ సంస్థ ఒక్కో వాహనం నుంచి రూ.5 నుంచి రూ.50 వరకు ఛార్జీలు వసూలు చేస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కారు, జీపులకు రూ.5, లైట్ వెహికిల్ ఫర్ గూడ్స్ కు రూ.10, ట్రక్కు రూ.25, బస్సు రూ.35, భారీ వాహనాలకు రూ.35 నుంచి రూ.50 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రతీ ఏడాది ఏప్రిల్ 1న టోల్ ఛార్జీలు పెంచుతారు. ఇందులో భాగంగా 2024 ఏప్రిల్ 1న ఛార్జీలు పెంచి వసూలు చేశారు కూడా. తాజాగా పెంపుదల నిర్ణయం వెనక్కి తీసుకోవడంతో వసూలు చేసిన అదనపు మొత్తాలను తిరిగి వారి అకౌంట్లోకి జమ చేస్తామని చెబుతున్నారు.
ఎలక్షన్ పూర్తయిన తరువాత టోల్ ఛార్జీలు పెంపుదల ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇంతే మొత్తంలో పెంచుతారా? లేక అదనంగా ఉంటుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే తాత్కాలికంగా టోల్ పెంపు లేని నిర్ణయం వాహనదారులకు ఊరటనిస్తోంది. హైదరాబాద్ – విజయవాడపై ప్రతీరోజు 25 వేల వాహనాలు ప్రయాణిస్తుంటాయి.2023-2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీఎంఆర్ సంస్థకు టోల్ ప్లాజా ద్వారా రూ.2.222 మిలియన్ల ఆదాయం సమకూరిందని తెలుస్తోంది.