Chandrababu: ఏపీలో పింఛన్ల రగడ నడుస్తోంది. ప్రతి నెల ఒకటో తేదీకి అందాల్సిన పింఛన్.. ఈనెల ఆ తేదీకి అందలేదు. అందుకు మీరంటే మీరే కారణం అంటూ వైసిపి, టిడిపి ఆరోపణలు చేసుకుంటున్నాయి. టిడిపి అభ్యంతరం తెలపడం వల్లే పింఛన్ పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని వైసీపీ చెబుతుండగా.. ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతోందని.. వాలంటీర్లు లేకపోతే సచివాలయ ఉద్యోగులతో ఇంటింటా పింఛన్లు పంపిణీ చేపట్టవచ్చు కదా అని ప్రశ్నిస్తోంది. అయితే గత ఐదు సంవత్సరాలుగా ఇంటి వద్ద పింఛన్ అందుకుంటున్న వృద్ధులు.. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్ముతున్నారు. దీంతో ఇది టిడిపికి ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. పింఛన్ లబ్ధిదారులతో పాటు వాలంటీర్లకు భరోసా ఇస్తూ కొన్ని ప్రకటనలు చేశారు.
ఈ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ముందుగానే ఒక ప్రకటన చేసింది. ఈనెల 3న వాలంటీర్లతో పింఛన్లు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయడం సరికాదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసీకి లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎలక్షన్ కమిషన్ పింఛన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా చేపట్టకూడదని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల వద్ద పింఛన్ పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసింది. అయితే ఈ నెల 3న పింఛన్లు ఇస్తామని చెప్పిన వైసీపీ సర్కార్ కొత్త పల్లవి అందుకుంది. ఒకటో తేదీన పింఛన్లు రాకపోవడానికి టిడిపి కారణమని ప్రచారం ప్రారంభించింది. దీంతో తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయ్యింది.
దీనిపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ విషయంలో వైసీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని భావించారు. అటు వలంటీర్లతో పాటు పింఛన్ లబ్ధిదారులకు ఉపశమనం కలిగించేలా ప్రకటనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచనున్నట్లు ప్రకటించారు. ప్రతి నెల ఈ మొత్తాన్ని ఇంటికి తెచ్చి ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు. రెండు మూడు నెలలు తీసుకోకపోయినా ఆ మొత్తాన్ని కలిపి లబ్ధిదారులకు అందిస్తామని స్పష్టం చేశారు. వాలంటీర్ల విషయంలో తమకు ఒక స్పష్టత ఉందని.. ఈ వ్యవస్థను కొనసాగిస్తామని.. ఇంతకంటే మంచి భవిష్యత్తు కల్పిస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. మొత్తానికైతే పింఛన్ల జాప్యం లో తెలుగుదేశం పార్టీపై జరుగుతున్న ప్రచారంతో చంద్రబాబు ఒక్కసారిగా భయపడ్డారు. అందుకే యుద్ధ ప్రాతిపదికన ఈ హామీలు ఇచ్చారు. టిడిపి సోషల్ మీడియా సైతం దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.