Saffron: చుక్కల్లో ‘ఎర్ర బంగారం’ ధరలు.. కిలో రూ.5 లక్షలు..!

ప్రపంచంలో పండే కుంకుమ పువ్వులో 90 శాతం ఇరాన్‌లోనే పండిస్తున్నారు. ఆ దేశం ఏటా సుమారు 430 టన్నులు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తుంది.

Written By: Raj Shekar, Updated On : May 12, 2024 8:24 am

Saffron

Follow us on

Saffron: ఏడాది కాలంగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే పోతున్నాయి. పది గ్రాముల బంగారం ప్రస్తుతం రూ.70 వేలకుపైగా పలుకుతోంది. ఈ బంగారంతో ఎర్ర బంగారంగా గుర్తింపు పొందిన కుంకుమ పువ్వు ధరలు కూడా పోటీ పడుతున్నాయి. యుద్ధం కారణంగా ఎర్రబంగారం ధరలు పెరుగుతున్నాయి. సుగంధ ద్రవ్యాల రాణిగా పిలిచే కుంకుమ పువ్వు వంటల నుంచి ఔషధాలు, సౌందర‍‍్య ఉత్పత్తుల్లోనూ వినియోగిస్తారు. యుద్ధం కారణంగా సరఫరా సరిపడినంత లేకపోవడంతో దేశంలో కుంకుమ పువ్వు ధరలకు రెక్కలొచ్చాయి. రిటైల్ మార్కెట్లో కేజీ ధర ఏకంగా రూ.5 లక్షలకుపైగా పలుకుతోంది.

ఇరాన్‌లోనే ఎక్కువ..
ప్రపంచంలో పండే కుంకుమ పువ్వులో 90 శాతం ఇరాన్‌లోనే పండిస్తున్నారు. ఆ దేశం ఏటా సుమారు 430 టన్నులు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తుంది. అయితే ఇజ్రాయెల్‌-గాజా యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరాన్‌ నుంచి కుంకుమ పువ్వు సరఫరా భారీగా తగ్గంది. దీంతో దేశీయంగా దీని ధర పెరుగుతోంది.

మన కశ్మీర్‌లో కూడా..
కుంకుమ పువ్వును మన దేశంలో జమ్మూకశ్మీర్‌లో పండిస్తారు. ఇరాన్‌ నుంచి దిగుమతి తగ్గడంతో దేశీయ వర్తకులు, ఉత్పత్తిదారులకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా ఎర్ర బంగారం ధర కొండెక్కింది. హోల్‌సేల్‌లో 20 శాతం, రిటైల్‌లో 27 శాతం మేర ధర పెరిగినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ముందు హోల్‌సేల్‌గా కిలో కుంకుమ పువ్వు ధర రూ.2.8 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండేది. ఇపుపడు రూ.3.5 లక్షల నుంచి రూ.3.6 లక్షలకు వరకు పలుకుతోంది. ఇక రిటైల్‌ మార్కెట్‌లో కిలో కుంకుమ పువ్వు ధర ఏకంగా రూ.4.95 లక్షలు పలుకుతోంది.

మన దేశంలో 65 టన్నుల డిమాండ్‌..
ఎర్ర బంగారానికి మన దేశంలో ఏటా 60 నుంచి 65 టన్నుల వరకు డిమాండ్‌ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా పండే దానితో పోలిస్తే కశ్మీర్‌లో పండించే కుంకుమపువ్వు ఇంకాస్త ప్రత్యేకమే. అయితే కొన్నేళ్లుగా కశ్మీర్‌తో దీని దిగుమబడి తగ్గుతోంది. ప్రస్తుతం భారత దేశంలో కేవలం 3 టన్నుల కన్నా తక్కువ పండుతోంది. దీంతో మిగతా డిమాండ్‌ కోసం దిగుమతిపైనే ఆధారపడుతున్నాం. ప్రస్తుతం దిగుమతి తగ్గడంతో ధర రికార్డు స్థాయిలో పెరిగింది.