Tesla : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఎన్నో ఏళ్లుగా భారతీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం కంపెనీ తన ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. అయితే తాజాగా ఒక వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. టెస్లా తన వినియోగదారులకు బుకింగ్ డబ్బును తిరిగి చెల్లిస్తోంది.
టెస్లా ఇంక్ ఇండియా తన మోడల్ 3 ప్రారంభ బుకింగ్ చేసుకున్న వారికి డబ్బును తిరిగి ఇచ్చేస్తోంది. దీంతో అమెరికన్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారతదేశంలో తన ప్రవేశానికి ముగింపు పలికిందనే ఊహాగానాలకు తెరలేచింది. టెస్లా స్వయంగా మెయిల్ ద్వారా వినియోగదారులకు బుకింగ్ డబ్బును తిరిగి చెల్లిస్తున్నట్లు సమాచారం ఇస్తోంది.
Also Read : ప్రభుత్వ ఖజానా ఖాళీ.. ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీకి ఇక గుడ్ బై చెప్పాల్సిందేనా?
2016లోనే బుకింగ్స్
టెస్లా పంపుతున్న మెయిల్‌లో “మేము ప్రస్తుతం మీ బుకింగ్ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటున్నాము” అని ఉంది. ఈ మెయిల్ 2016లో బుక్ చేసుకున్న వినియోగదారులకు పంపేశారు. కంపెనీ మెయిల్ లో ఇంకా ఇలా చెప్పుకొచ్చింది. “మేము భారతదేశంలో మా ప్రొడక్ట్స్ ఖరారు చేసిన తర్వాత మళ్లీ మార్కెట్‌లోకి వస్తాము. మేము మీ దేశంలో ప్రారంభించడానికి, డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు మళ్లీ మాతో ఉంటారని ఆశిస్తున్నాము.” మోడల్ 3 పాత మోడల్‌ను నిలిపివేయడంతో ఎలాన్ మస్క్ కార్ల తయారీ సంస్థ సంవత్సరాల నాటి బుకింగ్ డబ్బులను తిరిగి ఇస్తోంది.
భారతదేశంలో టెస్లా ఎప్పుడు?
టెస్లా డొమైన్ నుండి వచ్చిన ఈ మెయిల్స్ దిగుమతి సుంకం తగ్గిన తర్వాత భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించాలని కార్ల కంపెనీ యోచిస్తోందనే కొత్త సంకేతాలను ఇస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం మస్క్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో ఈ సంవత్సరం చివరిలో తాను భారతదేశాన్ని సందర్శిస్తానని చెప్పాడు. భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది. ఈ ఒప్పందంలో ఆటోమొబైల్స్‌పై టారీఫ్ లను తగ్గించడంపై కూడా నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.
భారత్‌లో సైబర్‌ట్రక్
గత కొన్ని రోజులుగా భారతదేశపు డైమండ్ సిటీగా పేరుగాంచిన సూరత్‌లో టెస్లా సైబర్‌ట్రక్ సందడి చేసింది. సూరత్‌కు చెందిన కోటీశ్వరుడు లవ్జీ డాలియా ఈ సైబర్‌ట్రక్‌ను కొనుగోలు చేశాడు. డాలియా తన సామాజిక సేవల కారణంగా లవ్జీ బాద్షాగా పేరు పొందాడు. అతను ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ , గోపిన్ గ్రూప్ ప్రమోటర్. అంతేకాకుండా, ఇది భారతదేశంలోకి వచ్చిన మొదటి టెస్లా సైబర్‌ట్రక్ అని కూడా చెబుతున్నారు.