Tata Punch : ప్రస్తుతం ఇండియన్ కార్ల మార్కెట్లో మార్పులు జరుగుతున్నాయి. ఓ వైపు చిన్న కార్లకు బదులు పెద్ద ఎస్ యూవీలను జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతుండడంతో సీఎన్జీ, ఎలక్ట్రిక్ మోడల్స్ ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ రెండు ట్రెండ్‌లకు సరిగ్గా సరిపోయే ఒక కారు ప్రస్తుతం మార్కెట్లో దుమ్ములేపుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన SUV ఇదే కావడం విశేషం. అదే టాటా వారి చౌకైన SUV.. పంచ్.
టాటా పంచ్ ఆర్థిక సంవత్సరం 2025లో అత్యధికంగా అమ్ముడైన SUVగా రికార్డు సృష్టించింది. టాటా మోటార్స్ ఈ ఏడాది ఏకంగా 196,567 యూనిట్ల పంచ్‌ను విక్రయించింది. ఇది వార్షికంగా 16 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2024లో కూడా టాటా పంచ్ 1,69,844 యూనిట్లు అమ్ముడై 27 శాతం వృద్ధిని సాధించింది. టాటా పంచ్ పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ అనే మూడు రకాల ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే పంచ్ సీఎన్‌జీ వేరియంట్ విడుదలైన తర్వాత దీని అమ్మకాలు మరింతగా పెరిగాయి. టాటా స్వయంగా చెప్పినట్లుగా పంచ్ మొత్తం అమ్మకాల్లో సీఎన్‌జీ వాటా దాదాపు 33శాతంగా ఉంది. పంచ్ డిమాండ్‌ను పెంచడంలో సీఎన్‌జీ కీలక పాత్ర షోషించింది.
Also Read : ఫైవ్ స్టార్ సేఫ్టీ.. తక్కువ ధర.. అమ్మకాల్లో ఇది రికార్డ్
కొద్ది సంవత్సరాల్లోనే నంబర్ వన్
టాటా పంచ్ సీఎన్‌జీని భారతదేశంలో ఆగస్టు 2023లో రిలీజ్ చేశారు. ఇది అనేక వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధర దాదాపు 7.10 లక్షల రూపాయల నుండి ప్రారంభమవుతుంది. పంచ్ సీఎన్‌జీలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, డ్యూయల్ సిలిండర్ సీఎన్‌జీ కిట్ ఉన్నాయి. ఈ కిట్ వల్ల ఎక్కువ మైలేజ్ రావడమే కాకుండా, రెండు చిన్న సిలిండర్లు కిందివైపు అమర్చబడి ఉండడం వల్ల సామాను పెట్టుకోవడానికి కవాల్సినంత బూట్ స్పేస్ కూడా లభిస్తుంది. సాధారణంగా టాటా ఈ టెక్నాలజీ టాటా ప్రతి సీఎన్‌జీ కారులో ఉంటుంది. ఇదే ప్రజలకు బాగా నచ్చింది. ఎందుకంటే మారుతి, హ్యుందాయ్ వంటి సీఎన్‌జీ కార్లలో సీఎన్‌జీ కిట్ అమర్చిన తర్వాత బూట్ స్పేస్ దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది.
టాటా మోటార్స్ ప్రకారం టాటా పంచ్ సీఎన్‌జీ వేరియంట్ మొత్తం పంచ్ అమ్మకాల్లో 33శాతం వృద్ధిని అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 53%, ఈవీ వేరియంట్ 14% వృద్ధిని అందిస్తున్నాయి. సీఎన్‌జీ వేరియంట్ చేరడంతో పంచ్ బ్రాండ్ మొత్తం అమ్మకాలు 30% పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2024తో పోలిస్తే పంచ్ అమ్మకాల్లో 2 స్థానాలు మెరుగుపడ్డాయి. ఆ సమయంలో ఇది మారుతి బ్రెజా, టాటా నెక్సాన్ తర్వాత మూడవ అత్యధికంగా అమ్ముడైన SUV. మూడున్నర సంవత్సరాల క్రితం విడుదలైనప్పటి నుండి దేశీయ మార్కెట్‌లో పంచ్ మొత్తం అమ్మకాలు 550,000 యూనిట్లను దాటాయి. గత ఆర్థిక సంవత్సరంలో పంచ్ బ్రెజా, ఫ్రాంక్స్, నెక్సాన్ ఈ మూడు కార్లను వెనక్కి నెట్టి నంబర్ వన్‌గా నిలిచింది.
టాటా పంచ్ ఎక్స్-షోరూమ్ ధర వేరియంట్‌ను బట్టి మారుతుంది. బేస్ మోడల్ ప్యూర్ ధర రూ.6,19,900 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే టాప్-ఎండ్ మోడల్ క్రియేటివ్ ప్లస్ ఎస్ కామో AMT ధర రూ.10,32,000. RTO, బీమా, ఇతర ఛార్జీలతో కూడిన ఆన్-రోడ్ ధర రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. టాటా పంచ్ పెట్రోల్‌లో లీటరుకు 18.8కిమీ మైలేజ్, సీఎన్‌జీ మోడల్‌లో లీటరుకు 26.99కీమీ మైలేజ్ లభిస్తుంది.
Also Read : దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుపై ఊహించని డిస్కౌంట్