Electric Vehicles : ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తే ప్రస్తుతం ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ యోజన (PM E-Drive) కింద సబ్సిడీ అందిస్తోంది. అయితే ఈ సబ్సిడీ నేరుగా కస్టమర్ ఖాతాలో జమ కావడానికి 40 రోజుల వరకు సమయం పడుతుంది. కేవలం 5 రోజుల్లోనే ఈ సబ్సిడీ కావాలంటే ఒక ముఖ్యమైన పని చేయాలి. పీఎం ఈ-డ్రైవ్ సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తున్న భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ విషయంలో ఒక ప్రణాళికను రూపొందించింది. దీని ద్వారా ప్రజలకు సబ్సిడీ వోచర్ త్వరగా అందుతుంది.
Also Read : ఎలక్ట్రిక్ వాహనాలతో రూ. 9 లక్షల కోట్ల ఆదా.. లక్షల కొద్దీ ఉద్యోగాలు!
పీఎం ఈ-డ్రైవ్ సబ్సిడీ పథకం ప్రయోజనం పొందడానికి ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుదారులు ఆధార్ ఈ-కేవైసీ చేయించుకోవాలి. దీని కోసం వారు పీఎం ఈ-డ్రైవ్ యాప్ లేదా పోర్టల్‌లో ఫేస్ అథెంటికేషన్ చేయాలి. దీని ద్వారా వారి సబ్సిడీ వోచర్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత సబ్సిడీ జమ కావడానికి 40 రోజుల వరకు సమయం పడుతుంది. మంత్రిత్వ శాఖ ఈ ప్రక్రియను వేగవంతం చేసి 40 రోజుల బదులు కేవలం 5 రోజుల్లోనే సబ్సిడీని అందించడానికి కృషి చేస్తోంది. పీఎం ఈ-డ్రైవ్ యోజన డబ్బు ప్రజలకు వీలైనంత త్వరగా చేరవేయాలని వారు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఈవీ సబ్సిడీని త్వరగా పొందాలనుకుంటే వెంటనే మీ ఆధార్ ఈ-కేవైసీని పూర్తి చేసుకోండి.
పెండింగ్‌లో ఉన్న పీఎం ఈ-డ్రైవ్ యోజన క్లెయిమ్‌ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ 2-వీలర్లకు సంబంధించిన సబ్సిడీ క్లెయిమ్‌ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. బిజినెస్ స్టాండర్డ్ వార్తా కథనం ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2024-25 నాటికి 1.26 లక్షల క్లెయిమ్‌లు ప్రాసెస్‌లో ఉన్నాయి. ఇందులో 1.09 లక్షల క్లెయిమ్‌లు కేవలం ఎలక్ట్రిక్ 2-వీలర్లవే. అయితే మంత్రిత్వ శాఖకు మొత్తం 8.93 లక్షల క్లెయిమ్‌లు అందాయి.
అయితే పీఎం ఈ-డ్రైవ్ యోజన గురించి కొన్ని రోజుల క్రితం ఒక మీడియా నివేదికలో ఈ పథకం దాని అసలు గడువు అయిన మార్చి 31, 2026 కంటే ముందే ముగిసే అవకాశం ఉందని పేర్కొంది. పీఎం ఈ-డ్రైవ్ పథకం ఒక లిమిటెడ్ నిధుల పథకం. ఈవీ కొనుగోళ్లు పెరగడం వల్ల ఈ పథకం నిధులు సమయానికి ముందే పూర్తిగా పంపిణీ అవుతాయి. పీఎం ఈ-డ్రైవ్ యోజన కింద ప్రభుత్వం 10,900 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో ప్రధానంగా 2-వీలర్, 3-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లతో సహా) సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. కానీ నిధులు అయిపోవడం వల్ల ఈ సబ్సిడీ పథకం త్రీవీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కేటగిరీకి జూలై-ఆగస్టు 2025 నాటికి, టూ వీలర్ కేటగిరీకి జనవరి 2026 నాటికి ముగిసే అవకాశం ఉంది.
Also Read : త్వరలో భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు..మంత్రి సంచలన ప్రకటన