Star Bucks CEO  : స్టార్ బక్స్ సీఈవోగా లక్ష్మణ్ నరసింహన్ తొలగింపు.. కారణమదేనా..? కొత్త సీఈవో ఎవరంటే?

లక్ష్మణ్ నరసింహన్ 2023లో స్టార్ బక్స్ సీఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. సరిగ్గా ఏడాది తర్వాత కంపెనీ అతడిని ఆ పదవి నుంచి తొలగించింది. కొత్త సీఈవోగా బ్రియాన్ నికోల్ బాధ్యతలు తీసుకోనున్నారు.

Written By: Dharma, Updated On : ఆగస్ట్ 14, 2024 2:08 సా.

Star Bucks CEO

Follow us on

Star Bucks CEO  : స్టార్ బక్స్ ప్రస్తుత సీఈవో లక్ష్మణ్ నరసింహన్ ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక ఆ స్థానాన్ని సియాటిల్ కు చెందిన కాఫీ కంపెనీ చిపోటిల్ సీఈవో బ్రియాన్ నికోల్ ను నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఇందుకు సంబంధించి లక్ష్మణ్ నరసింహన్ వీడియో ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతున్నది. ఇందులో ఆయన తన జీవితం, పని సమతుల్యతను కాపాడుకునేందుకు సాయంత్రం ఆరు గంటల తర్వాత పని చేయనని చెప్పారు. స్టార్ బక్స్ లో ఎవరైనా ఆరు గంటల తర్వాత ఒక నిమిషం పని చేసినా తమ అమూల్యమైన సమయం కోల్పోయినట్లేనని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆయన ఆ కంపెనీ నుంచి వెళ్లిపోయారు అంటూ ఎక్స్ వేదికగా ఒక నెటిజన్ దీనిని పంచుకున్నారు. అయితే స్టార్ బక్స్ సీఈవోగా ఉన్న లక్ష్మణ్ నరసింహన్ (57) ఈ ఇంటర్వ్యూను ఫార్చ్యూన్ మ్యాగజైన్ కు ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాలను ఆయన చర్చించాడు. పని, జీవిత సమతుల్యతను గురించి ఒక ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించాడు. తాను సాయంత్రం 6 గంటలలోగా తన పని పూర్తి చేసుకుంటానని చెప్పాడు. ఈ సమయానికి మించి ఉంటే తన అమూల్యమైన సమయాన్ని కోల్పోయినట్లేనని ప్రకటించాడు.

కాగా, ప్రస్తుతం లక్ష్మణ్ నరసింహన్ తొలగింపు అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ మాజీ సీఈవో గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. అతని విద్యాభ్యాసం, ఫ్యామిలీ, వేతనం తదితర వివరాలు తెలుసుకునేందుకు గూగుల్ ను ముప్పు తిప్పలు పెడుతున్నారు. లక్ష్మణ్ నరసింహన్ ఎక్కడ పుట్టారు? ఎక్కడ చదివారు? గతంలో ఏం చేసేవారు? లాంటి వివరాలను నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఈయన తొలగింపుపై ఒక్కో నెటిజన్ ఒక్కోలా స్పందించారు. ఎక్స్ వేదికగా ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘స్టాక్ ధర బాగున్నప్పుడు మీరు ఇలాంటివి చెబితే పెద్ద మేధావిలా, ప్రతిభాశీలిలా అందరికీ కనిపిస్తుంది. కానీ అది బాగా లేనప్పుడు ఇలానే బాధ్యతల నుంచి తొలగించబడుతారు’ అంటూ పంచుకున్నారు. మరొక నెటిజన్ స్పందిస్తూ ‘అతడి సంపాదన మిలియన్లలో ఉంటుంది.. ఇంకేం అతడు బాగానే ఉంటాడు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు.’ అన్నారు. మరొకరు స్పందిస్తూ ఇప్పుడు ఆయనకు సాయంత్రం ఆరు గంటల తర్వాతే నోటీస్ పంపబడిందని అనుకుంటా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.

మరో విషయం ఏంటంటే లక్ష్మణ్ నరసింహన్ సీఈవోగా తన బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకున్నారు. కంపెనీ ఆదేశాలను పాటించారు. ప్రస్తుతం లక్ష్మణ్ స్టార్ బక్స్ బోర్డులో సభ్యుడిగా కూడా లేడు. ఇక కొత్త సీఈవో గా నియమితులైన నికోల్ త్వరలోనే ఈ బాధ్యతలను తీసుకుంటాడని తెలుస్తున్నది. సెప్టెంబర్ 9న ఆయన ఈ బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తున్నది. అప్పటి వరకు కంపెనీలో ఉన్న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో)రాచెల్ రుగ్గేరి తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారు.

ఇక స్టార్ బక్స్ బోర్డ్ చైర్ మెలోడీ హాబ్బన్ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టరర్ గా వ్యవహరిస్తారని తెలుస్తున్నది. నికోల్ ఈ కంపెనీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లగలడని బోర్డు ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక నికోల్ స్పందస్తూ.. తన ఉత్సాహాన్ని పంచుకున్నాడు. ఆయన ఏమన్నారంటే ‘ స్టార్ బక్స్ లో చేరడం సంతోషంగా ఉంది. వేలాది మంది భాగస్వాములతో కలిసి ఈ కంపెనీని అద్బుతంగా తీర్చిదిద్దే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా’ అని తెలిపారు.